TTF Vasan: స్టంట్ చేస్తూ గాయపడిన యూట్యూబర్... అతడు గుణపాఠం నేర్చుకోవాల్సిందేనన్న మద్రాస్ హైకోర్టు

  • యూట్యూబ్ లో బైక్ వీడియోలు చేస్తూ పాప్యులారిటీ పొందిన టీటీఎఫ్ వాసన్
  • ఇటీవల చెన్నై-వేలూరు హైవేపై వికటించిన స్టంట్
  • చేయి విరగ్గొట్టుకున్న వాసన్... అరెస్ట్ చేసిన పోలీసులు
  • బెయిల్ కోసం హైకోర్టుకు వెళితే అక్కడా చుక్కెదురు
Madras High Court denies bail to injured youtuber

యూట్యూబ్ లో బైక్ స్టంట్ వీడియోలు చూసే వారికి టీటీఎఫ్ వాసన్ అనే యువకుడి వీడియోలు సుపరిచితమే. వాసన్ తమిళనాడుకు చెందినవాడు. బైక్ పై వీరోచిత స్టంట్లు, రోడ్ ట్రిప్ లతో పాప్యులారిటీ సంపాదించుకున్నాడు. యూట్యూబ్ లో అతడికి 45 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. 

ఇటీవల వాసన్ ఓ ప్రమాదకర స్టంట్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. చెన్నై-వేలూరు హైవేపై ప్రయాణిస్తూ స్టంట్ చేయబోయిన వాసన్ బైక్ ను నియంత్రించలేక చేయి విరగ్గొట్టుకున్నాడు. ఆ సమయంలో అతడు రేస్ సూట్, హెల్మెట్ ధరించి ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఈ వీడియోను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు వాసన్ పై కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. కాంచీపురం కోర్టు అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో వాసన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే, మద్రాస్ హైకోర్టు కూడా అతడిపై ఏమాత్రం కనికరం చూపలేదు. ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తున్న అతడు గుణపాఠం నేర్చుకోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. 

వాసన్ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ మద్రాస్ హైకోర్టులో విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా... వాసన్ కు యూట్యూబ్ లో లక్షలాది ఫాలోవర్లు ఉన్నారని, అతడు రూ.20 లక్షల ఖరీదు చేసే బైక్ పై స్టంట్లు చేస్తుంటాడని, అతడి రేస్ సూట్ ఖరీదు రూ.3 లక్షలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసుల తరఫున వాదనలు వినిపించారు. ఖరీదైన మోటార్ సైకిళ్లు కొని, రేసులు, స్టంట్లలో పాల్గొనేలా యువతను ప్రేరేపిస్తున్నాడని పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమైన ధోరణి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. 

ప్రాసిక్యూషన్ వాదనలను మద్రాస్ హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. వాసన్ కు బెయిల్ ఇవ్వాలని తాము అనుకోవడంలేదని స్పష్టం చేసింది. అతడికి ఇదొక గుణపాఠం కావాలని పేర్కొంది. అంతేకాదు, యూట్యూబ్ చానల్ మూసేయాలని వాసన్ ను ఆదేశించింది. ఆ తర్వాతే కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. ప్రస్తుతం అతడు గాయాలతో ఉన్నందున తగిన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు న్యాయస్థానం నిర్దేశించింది. 

బైక్ ముందు చక్రాన్ని గాల్లోకి లేపి రైడింగ్ చేసే ప్రయత్నంలో వాసన్ రోడ్డు పక్కన పడిపోయాడు. అతడి బైక్ కూడా ధ్వంసమైంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News