ANR: అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు.. తరలివచ్చిన తారాలోకం

  • అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా మొదలైన ఏఎన్నార్‌‌ శత జయంతి ఉత్సవాలు
  • హాజరైన మహేశ్, రామ్ చరణ్, రాజమౌళి
  • అక్కినేనిని గుర్తు చేసుకొని ట్వీట్‌ చేసిన చిరంజీవి
Former VP VenkaiahNaidu unveils the statue of ANR at Annapurna Studios marking the centenary birthday

తెలుగు సినీ దిగ్గజం, దివంగత అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏఎన్నార్ కుమారుడు నాగార్జున, అక్కినేని కుటుంబ సభ్యులు ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్టూడియోలో ఏర్పాటు చేసిన అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబసభ్యులతో పాటు టాలీవుడ్ చిత్రపరిశ్రమ ప్రముఖులు తరలివచ్చారు. 
హీరోలు రామ్‌ చరణ్‌, మహేశ్ బాబు, రానా, విష్ణు, నాని, రాజమౌళి, కీరవాణి, అల్లు అరవింద్‌, బ్రహ్మానందం, మురళీమోహన్‌, జయసుధ, మోహన్‌బాబు, శ్రీకాంత్‌, జగపతిబాబు, దిల్‌ రాజు, సుబ్బిరామిరెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎన్నార్‌ను గుర్తుచేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. 
‘అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా బ్రతికినంత వరకు అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి , నా సోదరుడు నాగార్జునకు.. నాగేశ్వరరావుగారి కోట్లాది అభిమానులకు, సినీ ప్రేమికులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఓ సినిమాలో ఏఎన్నార్‌‌ను ఎత్తుకున్న ఫొటోను కూడా షేర్‌‌ చేశారు.

More Telugu News