Ajeya Kallam: వివేకా హత్య కేసులో అజేయ కల్లం మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తారని ఊహించలేదు: సీబీఐ

  • వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న అజేయ కల్లం 
  • హైకోర్టులో పిటిషన్ వేసిన అజేయ కల్లం
  • తాను చెప్పిన వివరాలు వక్రీకరించారన్న కల్లం
  • కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ
  • కల్లం చెప్పిన మాటల ఆడియో రికార్డింగ్ ను కోర్టుకు సమర్పించిన వైనం
CBI disappoints with Ajeya Kallam petition in high court

వివేకా హత్య కేసులో ఏపీ సీఎం జగన్ సలహాదారు అజేయ కల్లం పిటిషన్ పై సీబీఐ అధికారులు నేడు తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో తన వాంగ్మూలం వక్రీకరించారని అజేయ కల్లం తన పిటిషన్ లో పేర్కొన్నారు. జగన్ ను భారతి పైకి పిలిచారని తాను చెప్పినట్టుగా తప్పుగా చెప్పారని అజేయ కల్లం ఆరోపించారు. ఈ పిటిషన్ పైనే సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. 

అజేయ కల్లం విచారణ ఆడియో రికార్డింగ్ చేసినట్టు సీబీఐ వెల్లడించింది. ఆ మేరకు అజేయ కల్లం విచారణ ఆడియో రికార్డింగ్ ను సీల్డ్ కవర్ లో ఉంచి హైకోర్టుకు సమర్పించింది. అజేయ కల్లం తీరుపై సీబీఐ అసహనం వ్యక్తం చేసింది. అజేయ కల్లం ప్రస్తుతం సీఎం ప్రధాన సలహాదారుగా ఉన్నారని, ఆయన పిటిషన్ విచారణార్హం కాదని సీబీఐ వాదించింది. 

ఏపీ ప్రభుత్వంతో అనుబంధాన్ని అజేయ కల్లం కూడా పిటిషన్ లో ఒప్పుకుంటున్నారని వెల్లడించింది. ఈ వ్యవహారంలో అజేయ కల్లం ప్రభావితమైనట్టు సీబీఐ పేర్కొంది. పిటిషన్ లో అజేయ కల్లం పేర్కొన్న అంశాలు 'ఇటీవల కలిగిన ఆలోచనలే' అని సీబీఐ పేర్కొంది. ఈ 'తర్వాత కలిగిన ఆలోచనలు' వల్లే ఆయన వాంగ్మూలం వెనక్కి తీసుకుంటున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించింది. 

ఈ కేసులో కొందరిని ఇరికించే ప్రయత్నమని ఆయన తన వాంగ్మూలంలో చేసిన ఆరోపణలు కల్పితమని సీబీఐ కొట్టిపారేసింది. వివేకా హత్య కేసులో స్వేచ్ఛగా, పారదర్శకంగా దర్యాప్తు చేశామని హైకోర్టుకు స్పష్టం చేసింది. అజేయ కల్లం సహా పలువురు సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశామని, వివేకా హత్య కేసులో అమాయకులను ఇరికించే ప్రయత్నం చేయలేదని పేర్కొంది. 

అజేయ కల్లం అంగీకారంతో ఆయన నివాసంలోనే వాంగ్మూలం తీసుకున్నట్టు వివరించింది. వివేకా హత్య కేసులో సాక్షిగా అజేయ కల్లం నుంచి వాంగ్మూలం తీసుకున్నామని, చట్టప్రకారమే వాంగ్మూలం నమోదు చేసి ఆజేయ కల్లంకు చదివి వినిపించామని స్పష్టం చేసింది. అజేయ కల్లం చెప్పిన ప్రతి అక్షరం నమోదు చేశామని, వాంగ్మూలంలో అవసరమైన చోట కొన్ని సవరణలు చేయమన్నారని సీబీఐ తెలిపింది. వాంగ్మూలంలో వాస్తవాలు నమోదు చేసినట్టు అజేయ కల్లం సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించింది. ఐఏఎస్ గా చేసిన కల్లంకు సీఆర్పీసీ 161 వాంగ్మూలం అంటే ఏమిటి, ఎందుకు ఆ వాంగ్మూలం నమోదు చేస్తారని తెలుసనుకుంటున్నామని సీబీఐ వివరించింది. 

అయితే ఉన్నట్టుండి దర్యాప్తు అధికారిపై అజేయ కల్లం ఆరోపణలు చేయడం విస్మయం కలిగించిందని, ఆయన ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. కేసు ప్రాసిక్యూషన్ ను దెబ్బతీసే ఉద్దేశంతోనే అజేయ కల్లం పిటిషన్ వేశారని సీబీఐ ఆరోపించింది. తద్వారా ఇతర సాక్షుల్లో అనుమానాలు రేకెత్తించేలా అజేయ కల్లం ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు అజేయ కల్లం ప్రయత్నిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. 

అజేయ కల్లం సీబీఐపై ఇలాంటి ఆరోపణలు చేస్తారని ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రికార్డుల నుంచి వాంగ్మూలం తొలగించాలని పేర్కొనడం ప్రాసిక్యూషన్ ను పక్కదారి పట్టించడమేనని తెలిపింది. సీనియర్ ఐఏఎస్ అధికారే వెనక్కి తగ్గితే సామాన్య సాక్షుల పరిస్థితి ఏంటని సీబీఐ ప్రశ్నించింది. ట్రయల్ కు ముందు ఇలాంటి పిటిషన్ లు వేసేందుకు ఇది సమయం కాదని పేర్కొంది. 

ట్రయల్ సమయంలో కల్లంను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. ధిక్కార వైఖరికి, పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇక, వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసిందని సీబీఐ ఈ సందర్భంగా న్యాయస్థానానికి తెలియజేసింది.

More Telugu News