Somireddy Chandra Mohan Reddy: సీఐడీ... ముఖ్యమంత్రి బూట్ల కింద నలిగిపోతోంది: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

  • కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రిపై కేసు పెడతారా?
  • వైసీపీ నేతల పాపాలు పండాయని, అనుభవిస్తారని వ్యాఖ్య
  • మచ్చలేని డిజైన్ టెక్ సంస్థ చైర్మన్‌ను జైలుకు పంపించారని ఆగ్రహం
Somireddy Chandramohan Reddy fires at YSRCP government

కార్పోరేషన్‌లో అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రిపై కేసు పెడతారా? అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. అక్రమాలు నిజమే అయితే బాధ్యులైన అధికారులను ప్రశ్నించరా? అని నిలదీశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ తన నాలుగున్నరేళ్ల కాలంలో తమ పార్టీ అధినేతపై ఒక్క నేరాన్ని కూడా నిరూపించలేక కడుపు మంటతో రగిలిపోతున్నాడన్నారు. చివరకు ఆధారాలు లేని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును ఇరికించి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఈ కేసులో ఒక్క ఆధారం కూడా లేక కుట్రపన్ను తప్పుడు కేసు పెట్టారన్నారు. దేశంలో మోడీ హయాంలో సీమెన్స్ కంపెనీ గుజరాత్‌లో మొదటగా మోడీ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అమలు చేశారన్నారు.

దానిని చూసిన తర్వాతే ఏపీలోని విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇప్పించాలనే ఉద్దేశంతో చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, డిజైన్ టెక్, సీమెన్స్ కంపెనీ మూడూ కలిసి ట్రైపార్టీ  అగ్రిమెంట్ చేసుకున్నాయన్నారు. డిజైన్ టెక్ ఎండి వికాస్ కన్వేల్కర్‌ను  సీఐడీ పోలీసులు అరెస్టు చేసి ఈ కేసులో అక్రమంగా జైలుకు పంపారన్నారు. గొంతువ్యాధితో బాధపడుతున్న ఆయన నిన్న ఒక వీడియోను విడుదల చేశారన్నారు. 

40 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు అవసరమైన కంప్యూటర్ల, ఎక్విప్ మెంట్‌ను సరఫరా చేశామని చెబుతూ... వెండార్లు సరఫరా చేసిన మెటీరియల్స్‌కు చేసిన చెల్లింపుల వివరాలను వికాస్ కన్వేల్కర్ విడుదల చేశారన్నారు. మొత్తం రూ.371.25 కోట్లలో ఖర్చులు పోను తమకు రూ.17.85కోట్లు అంటే 4.8 శాతం మాత్రమే లాభం వచ్చిందని కన్వేల్కర్ వివరించారన్నారు. అయినా సీఐడీ పోలీసులు తనను అరెస్టు చేసి, చంద్రబాబు పేరు చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టారని చెప్పారన్నారు. తమ అకౌంట్లను కూడా చెక్ చేసుకోవచ్చునని ఆయన స్టేట్‌మెంట్ విడుదల చేశారన్నారు. సీఐడీ పెట్టిన ఇబ్బందులకు కన్వేల్కర్ ఆరోగ్యం చెడిపోయిందని, గొంతులో పక్షవాతం వచ్చిందని, చివరకు హైకోర్టు చీవాట్లు పెట్టడంతో ఆయనను విడుదల చేశారన్నారు.

ఈ కేసులో చంద్రబాబుకు ఒక్క రూపాయి కూడా ముట్టలేదని ఆధారాలు ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందన్నారు. రూ.371 కోట్లలో ఒక్క రూపాయి ఏదైనా కంపెనీ నుండి చంద్రబాబుకు ముట్టిందంటే తాము దేనికైనా సిద్ధమన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్... భారతీ సిమెంట్, సాక్షి కంపెనీల నుండి నిధులు దోచుకున్నారని ఆరోపించారు. క్విడ్ ప్రో కో ను ఈ దేశానికి పరిచయం చేసింది జగనే అన్నారు. 2019లో జూన్ నుంచి నవంబర్ మధ్యలో ఏమీ చేయకుండానే జగన్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో దేశంలో మొదటి స్థానం సాధించామని పేపర్లలో యాడ్ లు వేయించుకున్నారన్నారు.

వికాస్ కన్వేల్కర్  నిన్న మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా 2.13లక్షల మందికి శిక్షణ, 75వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, 350 ట్రక్కుల్లో కంప్యూటర్లు తరలించామని చెప్పారన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులు, ఎక్విప్ మెంట్ తరలించిన వాహనాల వివరాలతో సహా ఆధారాలన్నీ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తమ పాలనలో స్కిల్ డెవలప్మెంట్ పెట్టకపోతే  ఇప్పుడున్న సెంటర్లు, వాటిలో ఉన్న ఎక్విప్‌మెంట్ నేడు విమర్శించే సుందరాంగులు, సుందరీమణులు పెట్టారా? వాళ్ల తాతలు తెచ్చి పెట్టారా? అని నిప్పులు చెరిగారు.

కేంద్రం ఏజెన్సీ వెరిఫికేషన్‌కు వచ్చి, మొత్తం పరిశీలించి సర్టిఫై చేసిన తర్వాత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఆమోదం తెలిపారన్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్ కంటే తక్కువ రేటుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు పెట్టడమే చంద్రబాబు చేసిన పాపమా? అన్నారు. అప్పటి స్కిల్ డెవలప్‌మెంట్ ఎండీ ఎన్ ప్రేమ్ చంద్రారెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ కల్లాంలు ఈ నిధులను విడుదల చేస్తే వాళ్లను ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు.

సీఐడీ జగన్మోహన్ రెడ్డి బూట్ల కింద నలిగిపోతోందని, నిష్పక్షపాతంగా కేసులు విచారణ చేయడం లేదన్నారు. ఇలాంటి వాళ్లకు పోలీసు డ్రస్ వేసుకోవడానికి సిగ్గు లేదా? అన్నారు. అఖిలపక్షంతో కలిసి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల పరిశీలనకు తాము సిద్ధమన్నారు. 40 సెంటర్లను తాము పెట్టామని తేలితే ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్లంతా ప్రజల ముందు చెంపలు వేసుకోవాలన్నారు.

వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో ఇసుక, మట్టి, శ్మశానాలతో సహా దోచుకున్నారన్నారు. వీటిని తాము విమర్శించాలంటే అయిదేళ్ళు కూడా చాలదన్నారు. సీమెన్స్ కంపెనీ అంటే మోడీకి చాలా గౌరవమని, ఒప్పందం మేరకు రూ.371 కోట్లతో మెటీరియల్ సప్లయ్ చేసినట్లు ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. వైసీపీ పాపాలు పండే రోజులు ముందున్నాయని, ప్రతి ఒక్కరూ ఫలితం అనుభవిస్తారన్నారు. సీఎం నుండి మంత్రులు, వైసీపీ నేతలంతా ఫలితం అనుభవిస్తారన్నారు. సీఐడీ ఏడీజీ ఎన్ సంజయ్ డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్వేల్కర్ అరెస్టుకు కారణాలు చెప్పాలని నిలదీశారు. వైసీపీ నేతలు, అధికారులకు దమ్ముంటే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు లేవని నిరూపించాలన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎఫ్ఐఆర్‌లో 37వ నిందితుడిగా చేసి, న్యాయ స్థానాలను తప్పుదోవ పట్టించడం సిగ్గుమాలిన చర్య అన్నారు.

More Telugu News