Smriti Irani: రాహుల్ గాంధీ అమేథిని వీడి... రాయ్‌బరేలి నుంచి పోటీ చేయడంపై స్మృతి ఇరానీ చురక

  • పోలింగ్‌కు ముందే అమేథిలో నెహ్రూ కుటుంబం ఓటమిని అంగీకరించిందన్న స్మృతి ఇరానీ
  • అమేథి, రాయ్‌బరేలి నియోజకవర్గాలను ఆ కుటుంబం పట్టించుకోలేదని విమర్శ
  • అయిదేళ్లలో అమేథిని ఎంతో అభివృద్ధి చేశానన్న స్మృతి ఇరానీ
Smriti Irani on Rahul Gandhi Amethi exit

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి అమేథి నుంచి కాకుండా రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడంపై కేంద్రమంత్రి, అమేథి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ స్పందించారు. అమేథిలో ఎన్నికలకు ముందే నెహ్రూ కుటుంబం ఓటమిని అంగీకరించిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి వెళ్లిపోవడమంటే అమేథి ప్రజల విజయమే అన్నారు. గత అయిదేళ్లలో అమేథిలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ఇందులో రెండేళ్లు కరోనాతోనే పోరాటం చేశామని, మిగిలిన మూడేళ్లలోనే అభివృద్ధి చేశామన్నారు. కానీ నెహ్రూ కుటుంబం 50 ఏళ్లుగా పట్టించుకోలేదని ఆరోపించారు.

'గాంధీలు అమేథిలో పోటీ చేయకపోవడాన్ని బట్టి చూస్తుంటే పోలింగ్‌కు ముందే వారు ఓటమిని అంగీకరించారు. గెలుస్తామని చిన్న ఆశ ఉన్నా వారే (రాహుల్ గాంధీ) పోటీ చేసేవారు. మరో అభ్యర్థిని నిలబెట్టకపోయేవారు' అని స్మృతి ఇరానీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమేథి అభ్యర్థిగా కిషోర్ లాల్ శర్మను నిలబెట్టింది.

కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని, ప్రజల కోసం నిరంతరం పని చేస్తుందని అమేథి ప్రజలకు స్మృతి ఇరానీ హామీ ఇచ్చారు. అమేథి ప్రజలు నెహ్రూ కుటుంబాన్ని 2019లో విడిచిపెట్టారన్నారు. రాహుల్ గాంధీని అమేథి ప్రజలు మూడుసార్లు గెలిపించినప్పటికీ ఇక్కడి వారికి అందుబాటులో లేకుండా పోయారని విమర్శించారు. అభివృద్ధి చేయలేదన్నారు. 

రాయ్‌బరేలీలో కూడా గాంధీ కుటుంబం ప్రజలకు సేవ చేయలేదన్నారు. అమేథీ తమను పక్కన పెట్టిందని వారికి తెలుసునని ఆమె పేర్కొన్నారు. కేరళలో ఎన్నికలు ముగియగానే రాహుల్ గాంధీకి సురక్షితమైన సీటు కోసం కాంగ్రెస్ చూస్తుందని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. కాగా, అమేథి, రాయ్‌బరేలి నియోజవకవర్గాల్లో మే 20న పోలింగ్ జరగనుంది.

  • Loading...

More Telugu News