cartier: రూ. 23 లక్షల విలువైన బంగారు, వజ్రాల చెవి కమ్మలను రూ. 2,300కే కొన్న కస్టమర్!

  • జువెలరీ సంస్థ వెబ్ సైట్ లో టైపింగ్ పొరపాటు ఫలితం
  • జత చెవి కమ్మలు రూ. 11.67 లక్షలకు బదులు రూ. 1,167గా పేర్కొన్న వెబ్ సైట్
  • ఎగిరి గంతేసిన మెక్సికో జాతీయుడు.. వెంటనే రెండు జతలకు ఆర్డర్ పెట్టిన వైనం
  • పొరపాటు గ్రహించి అసలు ఆర్డర్ కు బదులు కన్సోలేషన్ బహుమతి ఇస్తామన్న కంపెనీ
  • కుదరదన్న కస్టమర్.. కోర్టుకెక్కడంతో చేసేది లేక వాటిని డెలివరీ చేసిన సంస్థ
Mexican Man Buys 14000 dollar Cartier Diamond Earrings For 14 dollar After Website Price Glitch

వివిధ కంపెనీలు సేల్స్ పెంచుకొనేందుకు ఆన్ లైన్ షాపింగ్ లో భారీ ఆఫర్లు ప్రకటించడం అందరికీ తెలిసిందే. పండగల వేళ కొన్ని సంస్థలైతే దాదాపు 80 శాతం దాకా కూడా డిస్కౌంట్లు ఇస్తుంటాయి. కానీ మెక్సికోకు చెందిన ఓ కస్టమర్ కు మాత్రం అంతకు వెయ్యి రెట్ల జాక్ పాట్ తగిలింది! అతను కలలో కూడా ఊహించని విధంగా రూ. లక్షల విలువ చేసే ఆర్డర్ జస్ట్ వేల రూపాయలకే సొంతమైంది. అదే సమయంలో ఆ కంపెనీ చేసిన చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

మెక్సికోకు చెందిన రిజిలియో విల్లార్రియల్ గతేడాది ‘కార్టియర్’ అనే ఫ్రెంచ్ జువెలరీ సంస్థ వెబ్ సైట్ తెరిచి విండో షాపింగ్ చేస్తున్నాడు. అంటే వాటి ధరలు ఎలా ఉన్నాయో చూస్తున్నాడన్నమాట. కానీ అందులో 142 వజ్రాలతో పొదిగిన బంగారు చెవి కమ్మల ధర కేవలం 13.85 డాలర్లు మాత్రమే అని రాసి ఉన్న ఆఫర్ కు ఉబ్బితబ్బిబయ్యాడు. వెంటనే రెండు జతల చెవి కమ్మలకు ఆన్ లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ పెట్టాడు. తన ఆర్డర్ కోసం ఆతృతగా ఎదురు చూడటం మొదలు పెట్టాడు.

అయితే ఈ ఆర్డర్ ను చూసి కంపెనీ కంగుతిన్నది. వెబ్ సైట్ లో రేటు ఎంటర్ చేసేటప్పుడు టైపింగ్ లో చిన్న పొరపాటు జరిగిందని గుర్తించింది. ఈ విషయాన్ని కస్టమర్ కు తెలియజేసింది. వాటి జత అసలు ధర 14,000 డాలర్లని తెలిపింది. తాము పొరపాటు చేసినందున రెండు జతల కమ్మల ఆర్డర్ ను క్యాన్సిల్ చేసి అందుకు బదులుగా కన్సొలేషన్ బహుమతి అందిస్తామని ఆఫర్ ఇచ్చింది. కానీ రిజిలియో ఈ ఆఫర్ ను తిరస్కరించాడు. తాను ఆర్డర్ పెట్టిన రెండు జతల కమ్మలను డెలివర్ చేయాల్సిందేనని పట్టుబట్టాడు. దీనిపై మెక్సికో వినియోగదారుల పరిరక్షణ ఏజెన్సీని ఆశ్రయించాడు. దీంతో నెలలపాటు జరిగిన వాదనల అనంతరం కార్టియర్ సంస్థ వెనక్కి తగ్గింది. అతని ఆర్డర్ ను తాజాగా డెలివర్ చేసింది. చెవి కమ్మల అందమైన ప్యాకింగ్ ఫొటోలను రిజిలియో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తన తల్లికి ఒక జత చెవి కమ్మలను ఇచ్చానని.. మరో జతను తన వద్దే ఉంచుకున్నానని చెప్పాడు.

అయితే రిజిలియో వ్యవహరించిన వైఖరిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు యూజర్లు అతను చేసిన దాంట్లో తప్పేమీ లేదని వాదించారు. మరికొందరు మాత్రం అతన్ని విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కంపెనీ చేసిన సాధారణ పొరపాటు ద్వారా అనుచితంగా లబ్ధి పొందడం బాగోలేదని అంటున్నారు.

  • Loading...

More Telugu News