Pawan Kalyan: జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తుండడం గర్వంగా, అమితానందంగా ఉంది: పవన్ కల్యాణ్

  • ఢిల్లీలో రేపు, ఎల్లుండి జీ20 శిఖరాగ్ర సమావేశాలు
  • సన్నాహక సమావేశాల్లో 1.5 కోట్ల మంది భాగస్వాములయ్యారన్న పవన్
  • భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని వెల్లడి
  • 'వసుధైక కుటుంబం' స్ఫూర్తిని జీ20 సదస్సు చాటుతుందని ఆకాంక్ష
Pawan Kalyan opines on Bharat hosting G20 Summit

భారత్ లో రేపటి నుంచి రెండ్రోజుల పాటు ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు జరగనుంది. సెప్టెంబరు 9, 10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచ దేశాధినేతలతో ఈ శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. 

ఈ ఏడాది జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తుండడం గర్వంగానూ, అమితానందంగానూ ఉందని తెలిపారు. భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 60 నగరాల్లో 200 సన్నాహక సమావేశాలు నిర్వహించారని పవన్ వెల్లడించారు. ఈ సన్నాహకాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 1.5 కోట్ల మంది ప్రజలు భాగస్వాములయ్యారని, భిన్నత్వంలో ఏకత్వానికి ఇదే నిజమైన నిదర్శనం అని పేర్కొన్నారు. 

'వసుధైక కుటుంబం' అనే స్ఫూర్తిని ఈ జీ20 సదస్సు చాటుతుందని ఆశిస్తున్నామని, ఈ సదస్సు ద్వారా తీసుకునే సానుకూల నిర్ణయాలు భారత్ కు మాత్రమే కాకుండా, యావత్ మానవాళికి ఉపకరించే విధంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

జీ20 సదస్సు నేపథ్యంలో తన తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి, ఆయన బృందంలోని వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు పవన్ కల్యాణ్ వెల్లడించారు.

More Telugu News