నేను అమెరికా అధ్యక్షుడినైతే ట్రంప్‌కు క్షమాభిక్ష ప్రసాదిస్తా: వివేక్ రామస్వామి
- అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న భారత సంతతి రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి
- ఎన్నికల్లో పార్టీ తరపున నిలబడేందుకు నామినేషన్ కోసం ప్రయత్నాలు
- ట్రంప్‌కు పార్టీ నామినేషన్ లభిస్తే తాను పూర్తి మద్దతు ఇస్తానని వ్యాఖ్య
- అమెరికా ప్రయోజనాలు కాపాడేవారికే తన మద్దతని స్పష్టీకరణ
‘‘ వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అయితే నేను ఆయనకు పూర్తి మద్దతిస్తా. నేను అధ్యక్షుడినైతే ఆయనపై కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదిస్తా. అయితే, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికే నా తొలి ప్రాధాన్యత. ఆఖరుకి నేను చెప్పేదేంటంటే, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వారికే నా ఓటు. ఈ బాధ్యతలకు జో బైడెన్ సరికాదు. జో బైడెన్ తరువాత వచ్చే కమలా హారిస్ లేదా మరొకరో కూడా ఇందుకు అర్హులు కారు. దేశప్రజల ప్రయోజనాలకు పెద్ద పీట ఎవరు వేస్తారని ఓటు వేసే ముుందు ప్రశ్నించుకుంటా. ఇదేమీ ప్రతికారమో లేదా ఫిర్యాదుతోనో తీసుకునే నిర్ణయం కాదు. ఈ దేశ పౌరుడిగా తీసుకునే నిర్ణయం. దేశంలో ఈ స్ఫూర్తిని మళ్లీ రగిలించాలి. అమెరికా ఫస్ట్ అనే నినాదం డొనాల్డ్ ట్రంప్ కంటే పెద్దది. రాజకీయాలకంటే కూడా ఉన్నతమైనది ’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
గత నెలలో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం జరిగిన తొలి చర్చా కార్యక్రమంలో వివేక్ రామస్వామి అందరి దృష్టినీ ఒక్కసారిగా ఆకర్షించారు. తన ప్రభుత్వంలో వివేక్ గొప్ప ఉపాధ్యక్షుడు కాగలడని కూడా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కితాబునిచ్చారు.