రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి
- విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టామని వెల్లడి
- గురుకులాల్లో దాదాపు 12 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వివరణ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థల స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 5,310 టీచర్ పోస్టులు భర్తీ చేశామని, కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించామని చెప్పారు. దీంతో పాటు వివిధ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామని వివరించారు. ఇంటర్, డిగ్రీ స్థాయిలో 3,140 పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని మంత్రి సబిత తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తోందని, ప్రపంచం అబ్బురపడేలా సాగునీటి ప్రాజెక్టులు కట్టుకున్నామని చెప్పారు. నీళ్లు, నిధులకు సంబంధించి ఉద్యమకాలం నాటి ఆకాంక్షలు ఇప్పటికే నెరవేరాయని, నియామకాలకు సంబంధించిన ఆకాంక్షలు కొనసాగుతున్నాయని వివరించారు. కేసీఆర్ పాలనలో ప్రైవేటు రంగంలోనూ భారీగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.