Visakhapatnam District: విహారంలో విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన ఆరుగురు స్నేహితులు.. ఒకరి మృతి.. మరొకరు కోమాలోకి

  • అనకాపల్లి జిల్లాలోని సీతపాలెం తీరంలో ఘటన
  • రాళ్లపై నిలబడి ఫొటోలు తీసుకుంటుండగా విరుచుకుపడిన పెద్ద కెరటం
  • ఐదుగురిని రక్షించిన మత్స్యకారులు
  • గల్లంతైన యువకుడు సాయి మృతదేహం తీరానికి
  • మృతదేహాన్ని రెండు కిలోమీటర్ల మేర మోసిన పోలీసులు
One dead and one went to coma as 6 friends missing in Seethapalem beach

అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వారాంతాన్ని సరదాగా గడిపేందుకు వచ్చిన ఆరుగురు స్నేహితులు సముద్రంలో కొట్టుకుపోయారు. మత్స్యకారులు అప్రమత్తమై ఐదుగురిని రక్షించారు. గల్లంతైన ఒకరి మృతదేహం ఆ తర్వాత తీరానికి కొట్టుకొచ్చింది. మరొకరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్టణానికి చెందిన కట్టోజు సాయి (19), కట్టోజు కావ్య (17), సింహాచలానికి చెందిన గన్నవరపు సాయి ప్రియాంక (27), గన్నవరపు రవిశంకర్ (28), అల్లిపురానికి చెందిన కండిపల్లి ఫణీంద్ర (25), కండిపల్లి సాయికిరణ్ (25) కలిసి నిన్న ఉదయం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సీతపాలెం బీచ్‌కు విహారం కోసం వెళ్లారు. 

అందరూ కలిసి ఆనందంగా గడుపుతూ స్నానాలు చేశారు. ఆ తర్వాత తీరం సమీపంలోని రాళ్లపై నిలబడి ఫొటోలు తీసుకుంటున్న సమయంలో పెద్ద కెరటం ఒక్కసారిగా వారిపై విరుచుకుపడింది. దీంతో అందరూ ఒక్కసారిగా సముద్రంలో పడి కొట్టుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన మత్స్యకారులు వారిని రక్షించేందుకు సముద్రంలో దూకారు. 

సాయి అప్పటికే కొట్టుకుపోగా మిగతా ఐదుగురిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. సాయి ప్రియాంక సముద్రపు నీటిని తాగేయడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. గల్లంతైన సాయి మృతదేహం ఆ తర్వాత అచ్యుతాపురం మండలంలోని పూడిమడక తీరానికి కొట్టుకొచ్చింది. కోమాలోకి వెళ్లిన సాయి ప్రియాంక ప్రస్తుతం విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

తీరానికి కొట్టుకొచ్చిన సాయి మృతదేహాన్ని వాహనంలో తరలించే వీలులేకపోవడంతో అచ్యుతాపురం ఎస్సై సన్యాసినాయుడు ఆధ్వర్యంలో పోలీసులు రెండు కిలోమీటర్ల మేర మోసి మానవత్వం చాటుకున్నారు. అనంతరం అంబులెన్సులో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.

More Telugu News