Andhra Pradesh: వాహనదారులకు అలర్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • ఇకపై డిజిటల్ సర్టిఫికేట్లనే జారీ చేసేందుకు నిర్ణయించిన ఏపీ రవాణా శాఖ
  • ఏపీఆర్‌టీఏ వెబ్‌సైట్, ఆండ్రాయిడ్ యాప్‌లలో ప్రజలకు అందుబాటులో సర్టిఫికేట్లు
  • వాహన తనిఖీల్లో ఇవి చూపిస్తే సరిపోతుందని ప్రకటన
  • ఇప్పటికే డబ్బు చెల్లించిన వారికి ప్లాస్టిక్ కార్డులు ఇంటికి డెలివరీ అవుతాయని స్పష్టీకరణ
AP stopped issuing platic cards of Licence and RC opts for fully digital certificates

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌సీ లను ఇకపై డిజిటల్ రూపంలోనే జారీ చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ ప్రకటించింది. ప్లాస్టిక్ కార్డుల జారీకి స్వస్తి పలికినట్టు వెల్లడించింది. ఇప్పటికే కార్డులకు డబ్బులు చెల్లించిన వారికి మాత్రం త్వరలో అవి పోస్ట్‌లో వారివారి ఇళ్లకు పంపిస్తామని వెల్లడించింది. ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్కో కార్డుకు రూ.200, పోస్టల్ సర్వీస్ కింద మరో రూ.25 తీసుకుని కార్డులను ప్రజల ఇళ్లకు పోస్టులో పంపించేది. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహన్ పరివార్‌తో అనేక రాష్ట్రాలు ప్లాస్టిక్ కార్డుల స్థానంలో డిజిటల్ సర్టిఫికేట్లను జారీ చేయడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఏపీ కూడా డిజిటల్ బాట పట్టింది.  

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ప్రజలు రవాణా శాఖ వెబ్‌ సైట్ లేదా ఏపీఆర్‌టీఏసిటిజన్, ఈప్రగతి, ఓఆర్జీలో ఫారం 6 లేదా 23ని డౌన్‌లోడ్ చేసుకుని ధ్రువపత్రాలను తీసుకోవాలి. ఏపీఆర్‌టీఏసిటిజన్ ఆండ్రాయిడ్ యాప్‌తోనూ సర్టిఫికేట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాహనాల తనిఖీల సమయంలో యాప్‌లోని డిజిటల్ సర్టిఫికేట్లను ప్రభుత్వ అధికారులకు చూపిస్తే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిని అనుమతించాలని సంబంధిత అధికారులకూ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

More Telugu News