YS Sharmila: ట్రిపుల్ ఐటీల్లో ఆత్మహత్యలపై దర్యాప్తు కమిటీని నియమించాలి: షర్మిల

YS Sharmila on Basara triple it
షార్ట్స్‌లో చూడండి
బాసర ట్రిపుల్ ఐటీలో ఇప్పటి వరకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ బందిపోట్ల రాష్ట్ర సమితిలో చలనం లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె తన సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ విద్యా సంవత్సరంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయినా దొరకు పట్టింపు లేదన్నారు. ఉన్నత విద్యకు నిలయాలైన ట్రిపుల్ ఐటీలను ఆత్మహత్యలకు నిలయంగా మార్చారని ధ్వజమెత్తారు. గొప్ప ఆశయాలతో వచ్చిన పేద విద్యార్థులకు పురుగుల అన్నం, మురుగు నీరు పెట్టి ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం నియమించిన డైరెక్టర్లు కేసీఆర్ లాగే డుమ్మాలు కొడుతున్నారన్నారు. సిబ్బంది నియామకాలను మరిచారని, క్యాంపస్‌ల నిర్వహణను గాలికి వదిలేశారని, నిధుల కేటాయింపులను గంగలో కలిపేశారని విమర్శించారు. ఇంచార్జ్ అధికారులు, కాంట్రాక్టు ఉద్యోగులతో పబ్బం గడుపుతున్నారన్నారు. ఫొటోలకు పోజులిచ్చిన మంత్రులు ఇచ్చిన హామీల్ని గాలికొదిలేశారన్నారు. ఆరు నెలల కిందట ఊదరగొట్టే మాటలు మాట్లాడిన తండ్రీకొడుకులు మరునాడే పత్తా లేకుండా పోయారన్నారు. పేద బిడ్డలకు ఉన్నత విద్య అందించాలని వైఎస్ ట్రిపుల్ ఐటీలను స్థాపిస్తే.. కేసీఆర్ మాత్రం ట్రిపుల్ ఐటీలపై నమ్మకమే లేకుండా చేస్తున్నారన్నారు.

వైఎస్ హయాంలో ట్రిపుల్ ఐటీలో సీటు కోసం పోటీ పడిన విద్యార్థులు ఇప్పుడు సీటు కోసం అప్లై చేసుకోవడం కూడా మానేశారన్నారు. కేసీఆర్ దిక్కుమాలిన పాలన వల్ల పేద బిడ్డలకు ఉన్నత విద్య అందకపోగా, ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ట్రిపుల్ ఐటీల్లో ఆత్మహత్యలపై దర్యాప్తు కమిటీని నియమించాలని షర్మిల డిమాండ్ చేశారు. మరో విద్యార్థి ప్రాణం పోకముందే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.
Go Back to Shorts
YS Sharmila
Telangana
KCR
BRS

More Telugu News