Botsa Satyanarayana: సినిమా పరిశ్రమ పిచ్చుకనా?: చిరంజీవికి బొత్స సత్యనారాయణ ప్రశ్న

  • చిరంజీవి ఏ ఉద్దేశంతో అలా మాట్లాడారో తెలియదని వ్యాఖ్య
  • ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్న బొత్స
  • ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆరోపణ
  • వచ్చే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు రెస్ట్ ఇస్తారన్న మంత్రి
Botsa Satyanarayana question to Chiranjeevi

ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత టీడీపీ అధినేత చంద్రబాబుకు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అధికారంలో ఉన్న 14 ఏళ్లు ఆయన ఏం చేశారని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ అధినేత మాట్లాడేవన్నీ అబద్ధాలేనన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు పనులను ప్రారంభించారని, ఇప్పుడు ఆయన కొడుకు జగన్ పూర్తి చేస్తున్నారన్నారు. రైతులకు రావాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు రెస్ట్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు.

పుంగనూరు ఘటన చంద్రబాబు ప్రోద్బలంతోనే జరిగిందని ఆరోపించారు. తుపాకులు, కత్తులు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ఆయన కుట్రలు చేశారన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రను తాము అడ్డుకోమని, కానీ ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే తాము ఊరుకునేది లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా యాత్రలు చేయవచ్చునని చెప్పారు. విశాఖలో పవన్ వారాహి యాత్రపై దేశమంతా చర్చ జరుగుతుందని చెబుతున్నారని, పుంగనూరు మాదిరి విధ్వంసం చేయాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందిస్తుందన్నారు.

మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై కూడా బొత్స స్పందించారు. సినిమా పరిశ్రమ ఓ పిచ్చుకనా? చిరంజీవి చెప్పాలన్నారు. ఏ ఉద్దేశంతో చిరంజీవి అలా మాట్లాడారో తెలియదన్నారు. చిరంజీవి ఎందుకు వ్యాఖ్యలు చేశారో చెప్పాలన్నారు. ఆయన వ్యాఖ్యలు చూశాక పూర్తిస్థాయిలో స్పందిస్తానని చెప్పారు.

More Telugu News