ఉద్యమం అంటే ప్రభుత్వ వ్యతిరేక పోరాటం కాదన్నారు: గద్దర్‌పై సజ్జనార్ ట్వీట్

VC Sajjanar tweet on Gaddar
  • నెల రోజుల క్రితం గద్దర్ తనను కలిశారన్న సజ్జనార్
  • ఆర్టీసీ ఉద్యోగుల కష్టాల గురించి పాట రాసి సంస్థకు అంకితమిస్తానని చెప్పారన్న సజ్జనార్
  • అంతలోనే మరణవార్త దిగ్భ్రాంతికి గురి చేసిందన్న టీఎస్ఆర్టీసీ ఎండీ
టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం ఎల్బీ స్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా గద్దర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నెల రోజుల క్రితం ఆయన.. తనను కలిశారని సజ్జనార్ ట్వీట్ (ఎక్స్) చేశారు. అప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతతో పాటు బస్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారని సజ్జనార్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల కష్టాల గురించి ఒక పాటను రాసి, సంస్థకు అంకితం చేస్తానని చెప్పారని, అంతలోనే గద్దర్‌ మరణవార్త వినడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఒక లెజండరీ కవి, సామాజిక కార్యకర్తను కొల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటలతో ప్రజలలో చైతన్యం కలిగించి, ప్రజా యుద్ద నౌకగా ప్రజల హృదయాల్లో గద్దర్‌ గారు నిలిచిపోయారని కొనియాడారు.

గద్దర్‌తో తనకు దశాబ్ద కాలంగా పరిచయం ఉందని, అనేక సార్లు వ్యక్తిగతంగా తనను కలిశారని సజ్జనార్ పేర్కొన్నారు. ఎన్నో విషయాలను తనతో పంచుకున్నారని, తను చెప్పవలసిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, మృదువుగా చెప్పేవారన్నారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడమని చెప్పేవారని గుర్తు చేశారు. పాటను గద్దర్‌ వ్యాపారంగా చూడలేదని, పాట ద్వారా ప్రజా సమస్యలను బయటకు తెచ్చారన్నారు.

ప్రజాస్వామ్యం ద్వారానే హక్కులను సాధించుకోవడం సాధ్యమని గద్దర్‌ భావించారని, ఈ నేపథ్యంలో తను మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకుని.. ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. గద్దర్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Go Back to Shorts
vc sajjanar
Gaddar
tsrtc

More Telugu News