మహిళ, పిల్లలను నదిలోకి తోసేసిన భాగస్వామి.. చేతికి అందిన పైపు పట్టుకుని చిమ్మ చీకట్లో వేలాడుతూ ప్రాణాలు దక్కించుకున్న బాలిక
- రావులపాలెం గౌతమి పాతవంతెన వద్ద ఘటన
- చిన్నారి కళ్లముందే నదిలో కొట్టుకుపోయిన తల్లి, చెల్లి
- తన జేబులో సెల్ఫోన్ ఉన్న విషయం గుర్తొచ్చి ఓ చేత్తో దానిని తీసి డయల్ 100కు ఫోన్
- వెంటనే స్పందించి బ్రిడ్జి వద్దకు చేరుకున్న పోలీసులు
- వారొచ్చేంత వరకు పైపును పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్న బాలిక
కొత్త బట్టలు కొందామని నమ్మించి శనివారం సాయంత్రం కారులో ముగ్గురినీ తీసుకుని రాజమహేంద్రవరం బయలుదేరాడు. రాత్రంతా వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ నిన్న తెల్లవారుజామున 4 గంటల సమయంలో రావులపాలెంలోని గౌతమి పాత వంతెన వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకుందామని వారిని నమ్మించి కిందికి దింపాడు. ఆపై రెయిలింగ్ వద్దకు తీసుకెళ్లి అందరినీ ఒక్కసారిగా కిందికి తోసేశాడు.
సుహాసిని, జెర్సీ నదిలో పడిపోగా కీర్తనకు మాత్రం బ్రిడ్జికి ఉన్న కేబుల్ పైపు చేతికి చిక్కింది. చేతులతో దానిని గట్టిగా పట్టుకుంది. కాపాడాలంటూ కేకలు వేసింది. కానీ, ఆ చీకటిలో ఆమె ఆర్తనాదాలు గాలిలో కలిసిపోయాయి. చుట్టూ చీకటి, జనసంచారం లేదు. అయినా భయపడిపోలేదు. ఈ క్రమంలో తన జేబులో సెల్ఫోన్ ఉన్న విషయం గుర్తొంచింది.
ఒక చేత్తో పైపును గట్టిగా పట్టుకుని మరో చేత్తో దానిని తీసి పోలీస్ కంట్రోల్ రూము నంబరు 100కు ఫోన్ చేసింది. పరిస్థితి చెప్పింది. రావులపాలెం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పైపునకు వేలాడుతున్న బాలికను రక్షించారు. దాదాపు అరగంటపాటు చిమ్మచీకట్లో పైపుకు వేలాడుతూనే, మరో చేత్తో ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేసిన వైనం తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. బాలిక ధైర్యానికి ఫిదా అయిపోయారు. గోదావరి నదిలో గల్లంతైన ఆమె తల్లి, చెల్లెలు కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. నిందితుడు సురేశ్ కోసం వేట ప్రారంభించారు.