Hyderabad District: భర్తకు అందంగా కనపడాలనుకుంటే మహిళకు బట్టతల.. కాపురానికి ఎసరు!

Hyderabadi woman suffers bald head following treatment at a beauty parlor husband abandons her
  • హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఘటన
  • ఒత్తైన జుట్టు కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన మహిళ
  • వాళ్లిచ్చిన ట్రీట్‌మెంట్‌తో బట్టతల 
  • విషయం తెలిసి మహిళను పుట్టింటికి పంపేసిన భర్త
  • బ్యూటీ పార్లర్‌పై మహిళ పోలీసులకు ఫిర్యాదు
  • కోర్టు అనుమతితో కేసు నమోదు చేస్తామన్న పోలీసులు
ఒత్తైన జుట్టుతో భర్తకు మరింత అందంగా కనబడాలని ఓ మహిళ చేసిన ప్రయత్నం చివరకు ఆమె కాపురానికే ఎసరు తెచ్చింది. హైదరాబాద్‌లోని జగదీశ్ మార్కెట్ సమీపంలో నివసించే ఓ మహిళ మరింత ఒత్తైన జుట్టు కోసం స్థానికంగా ఉన్న క్వీన్జ్ బ్యూటీ పార్లర్ అండ్ సెలూన్ వారిని సంప్రదించింది. మహిళ చెప్పిందంతా విన్న పార్లర్ సిబ్బంది ఒత్తైన జుట్టుకోసం తమదైన ట్రీట్‌మెంట్ చేశారు. తొలుత ఆమె జుట్టు కత్తిరించి ఆపై ఏదో రసాయనం పూశారు. ఆ తరువాత మరో షాంపూ ఆమెకు ఇచ్చి ఇంటికెళ్లి తలస్నానం చేయమన్నారు. వారు చెప్పినట్టు చేయడంతో ఆమెకు భారీగా వెంట్రుకలు ఊడిపోయాయి. 

కంగారు పడిపోయిన మహిళ బ్యూటీపార్లర్ వారిని ఫోన్లో సంప్రదిస్తే ఊడిపోయిన వెంట్రుకల స్థానంలో కొత్తవి వస్తాయని ఆమెను శాంతింపజేశారు. ఆ తరువాత కొన్ని రోజులకు వెంట్రుకలు మరింతగా రాలి తల మధ్యలో బట్టతల తయారైంది. బెంబేలెత్తిపోయిన మహిళ మళ్లీ పార్లర్ వాళ్లను సంప్రదించగా ఈసారి సమస్యను ఉచితంగా పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. మహిళకు రకరకాల నూనెలు, షాంపూలు ఇచ్చి వాడమన్నారు. తాము చెప్పినట్టు చేస్తే చూస్తుండగానే ఒత్తైన జుట్టు వచ్చేస్తుందంటూ ఇంటికి పంపించారు. 

వాటిని వాడిన మహిళ జుట్టు మరింతగా పలచబడింది. ఏం చేయాలో పాలుపోక మహిళ జరిగిన దాని గురించి భర్తకు చెప్పి నెత్తిపై బట్టతలను చూపించింది. ఈ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయిన అతడు కోపంతో ఊగిపోతూ భార్యను పుట్టింటికి పంపించేశాడు. మహిళ మళ్లీ బ్యూటీ పార్లర్ వారిని సంప్రదించగా తాము చేయగలిగిందేమీ లేదంటూ వారూ చేతులెత్తేశారు. దిమ్మెరపోయిన బాధితురాలు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, కోర్టు అనుమతి తీసుకున్నాకే మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
Hyderabad District
Telangana
Andhra Pradesh

More Telugu News