Team India: భారత్ తో వన్డేలకు భారీ హిట్టర్​ను దింపుతున్న వెస్టిండీస్​

  • తిరిగి విండీస్‌ జట్టులోకి వచ్చిన షిమ్రన్ హెట్‌ మయర్ 
  • పేసర్ ఒషేన్ థామస్‌ కు కూడా చోటు
  • రేపటి నుంచి భారత్–విండీస్ వన్డే సిరీస్
West Indies recall Hetmyer and Thomas for ODIs

సొంతగడ్డపై భారత్‌ జట్టుతో టెస్టు సిరీస్‌ కోల్పోయిన వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో బలమైన పోటీ ఇవ్వాలని చూస్తోంది. గురువారం నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌ కు బలమైన జట్టును ఎంపిక చేసింది. కొన్నాళ్లుగా విండీస్‌కు దూరమైన హార్డ్ హిట్టర్ షిమ్రన్‌ హెట్‌మయర్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంది. 15 మందితో కూడిన ఈ జట్టులో బౌలర్ ఒషేన్ థామస్‌కు చోటు దక్కింది. హెట్‌మయర్‌ చివరగా జులై 2021లో ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్‌ ఆడగా, డిసెంబర్‌ 2021లో థామస్‌ విండీస్‌ తరఫున బరిలోకి దిగాడు. 

మాజీ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌, ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌తో పాటు గాయంతో ఇబ్బందిపడుతున్న ఆల్‌రౌండర్‌ కీమో పాల్‌ ఈ సిరీస్‌కు దూరంగా ఉంటున్నారు. భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్‌ నకు అర్హత సాధించడంలో విఫలమైన విండీస్‌ ఈ సిరీస్‌ లో రాణించాలని ఆశిస్తోంది. గురువారం, శనివారం కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా తొలి రెండు వన్డేలు జరుగుతాయి. ఆగస్ట్‌ 1న ట్రినిడాడ్‌లో మూడో వన్డే ఉంటుంది. తర్వాత ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. 

వెస్టిండీస్ వన్డే జట్టు: షై హోప్‌ (కెప్టెన్‌), రొవ్‌మన్‌ పావెల్‌, అలిక్‌ అథానజే, యానిక్‌ కారియా, కేసీ కార్టీ, డొమినిక్‌ డ్రేక్స్‌,  హెట్‌మయర్‌, అల్జారీ జోసెఫ్‌, బ్రెండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌, గుడకేశ్‌ మోతీ, జైడెన్‌ సీల్స్‌, రొమారియో షెఫర్డ్‌, కెవిన్‌ సింక్లెర్‌, ఒషేన్ థామస్‌.

More Telugu News