Bro Movie: థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతున్న సినిమాలు ఇవే!

  • ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'బ్రో'
  • పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం
  • ఈ నెల 29న విడుదలవుతున్న 'స్లమ్ డాగ్ హజ్బెండ్'
Telugu movies releasing this week

గత మూడు వారాలుగా థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. ఈ వారం పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన మల్టీ స్టారర్ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. మరో చిన్న చిత్రం కూడా విడుదల కానుంది. 

ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలు:
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. తమిళంలో ఘన విజయం సాధించిన 'వినోదయ సిత్తం' రీమేకే ఈ సినిమా. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, బ్రహ్మానందం, సముద్రఖని, రోహిణి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. 

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు నటించిన చిత్రం 'స్లమ్ డాగ్ హస్బెండ్' ఈ నెల 29న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటించింది. బ్రహ్మాజీ, సప్తగిరి ప్రధాన పాత్రలను పోషించారు. జాతక దోషం ఉన్న యువకుడు కుక్కను పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేదే ఈ సినిమా కథాంశం. కుక్క పాత్రకు వెన్నెల కిశోర్ వాయిస్ ఓవర్ అందించారు. 

రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన బాలీవుడ్ చిత్రం 'రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ' చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ కీలక పాత్రలను పోషించారు. 

ఓటీటీలో విడుదలవుతున్న చిత్రం: ఉదయనిధి స్టాలిన్, వడివేలు, కీర్తి సురేశ్ నటించిన 'మామన్నన్' జులై 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.  

More Telugu News