ఈ లక్షణాలున్న భర్తను వెతికిపెడితే రూ.4 లక్షలు ఇస్తానని ప్రకటించిన అమెరికా అమ్మాయి!
- తనకు నచ్చిన లక్షణాలున్న వ్యక్తిని వెతికి పెట్టాలన్న లాస్ ఏంజిల్స్ మహిళ
- టిక్ టాక్ లో వీడియో ద్వారా అప్పీల్
- డేటింగ్ ప్రయత్నాలతో విసిగిపోయానని వెల్లడి
- అందుకే నచ్చిన వ్యక్తిని వెతికి పెడితే వెంటనే నగదు బహుమతి ఇస్తానని వెల్లడి
ఇంతకుముందు తాను తన స్నేహితులు, తన యజమానితో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నానని, కానీ ఇప్పుడు అందరికీ ఈ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపింది. తాను చేసుకోబోయేవాడి లక్షణాలను కూడా ఆమె పేర్కొంది. అయిదేళ్లుగా ఒంటరిగా ఉంటున్నానని, డేటింగ్ ప్రయత్నాలతో విసుగు వచ్చిందని, కరోనా తర్వాత డేటింగ్ సంస్కృతిలోను మార్పులు వచ్చాయని పేర్కొంది. అబ్బాయిలు వ్యక్తిగతంగా సంప్రదించడం లేదని, అలాగే చాలామంది బంధాల విషయంలో సీరియస్ గా ఉండటం లేదన్నారు. ఈ క్రమంలో తనకు నచ్చిన వ్యక్తిని వెతికి పెడితే రూ.4 లక్షలు ఇస్తానని చెప్పింది. తన పెళ్లి సర్టిఫికెట్ చేతికి రాగానే సంబంధం వెతికి పెట్టిన వారికి నగదు బహుమతి ఇస్తామని తెలిపింది.
కాబోయే వరుడి లక్షణాలను వెల్లడిస్తూ.. అతని వయస్సు 27 నుండి 40 ఏళ్లు ఉండాలని, ఎత్తు 5.11 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని, సెన్సాఫ్ హ్యూమర్ తో పాటు క్రీడలపై మక్కువ, చిన్నారులు, జంతువుల పట్ల ప్రేమను కలిగి ఉండాలని పేర్కొంది. బంధాల విషయంలో సీరియస్ గా ఉండాలని, జాతి, మత, రాజకీయ విశ్వాసాల పట్ల తనకు ఎలాంటి పట్టింపు లేదని చెప్పింది. మాదకద్రవ్యాలు తీసుకోకూడదని, అతను అవివాహితుడై ఉండాలన్నారు.