నాది ఇప్పుడు ఇండియా.. బెయిలుపై బయటకొచ్చిన పాక్ మహిళ భావోద్వేగం
- పబ్ జీ గేమ్ ద్వారా భారతీయ యువకుడితో ప్రేమలో పడిన పాక్ మహిళ సీమా
- అప్పటికే ఆమెకు నలుగురు పిల్లలు
- అక్రమంగా భారత్‌లోకి వచ్చినందుకు అరెస్ట్
- తన భర్త హిందువైతే తాను కూడా హిందువునేనన్న మహిళ
- భారత్‌లో అధికారికంగా ఉండేందుకు ప్రయత్నాలు ప్రారంభం
వీరిద్దరి లవ్ స్టోరీ బాలీవుడ్ సినిమాను తలపించింది. కరోనా సమయంలో పబ్‌జీ గేమ్ ద్వారా ఇద్దరికీ పరిచయమైంది. అప్పటికే నలుగురు పిల్లల తల్లయిన సీమా.. ప్రియుడిని విడిచి ఉండలేనంత ప్రేమలో కూరుకుపోయింది. దీంతో అతడితో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో నేపాల్‌లో వారు కలుసుకుని వివాహం చేసుకున్నారు.
‘‘ఇది చాలా సుదీర్ఘమైన, కఠినమైన ప్రయాణం. నేను భయపడ్డాను కూడా. తొలుత కరాచీ నుంచి దుబాయ్ వెళ్లాను. అక్కడ నేను నిద్రపోకుండా 11 గంటలపాటు వేచి చూశాను. అక్కడి నుంచి నేపాల్ చేరుకున్నాను. ఆ తర్వాత రోడ్డు మార్గంలో పోఖ్రా చేరుకుని అక్కడ సచిన్‌ను కలుసుకున్నాను’’ అని సీమా వివరించింది.
నేపాల్‌లో వివాహం తర్వాత సీమా పాకిస్థాన్ వెళ్లిపోగా, సచిన్ ఇండియా వచ్చేశాడు. పాక్ వెళ్లిపోయిన సీమా ఓ ప్లాట్‌ను రూ. 12 లక్షల (పాకిస్థానీ రూపాయలు)కు విక్రయించింది. ఆ తర్వాత తనకు, నలుగురు పిల్లలకు నేపాల్ వీసా సంపాదించింది. మేలో పోఖ్రా చేరుకున్న ఆమె అక్కడి నుంచి మే 13న గ్రేటర్ నోయిడాకు వచ్చింది. అప్పటికే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న సచిన్.. తామిద్దరూ కలిసి ఉండేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె పాకిస్థాన్ మహిళ అని తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ నెల 4న వారి అరెస్టుతో విషయం బయటకు వచ్చి సంచలనమైంది.
నిన్న బెయిలుపై విడుదలైన సీమా ఇండియాకు అధికారికంగా వచ్చేందుకు ఏం చేయాలన్నదానిపై దృష్టిసారించింది. తాను చాలాకాలంపాటు జైలులో గడపాల్సి వస్తుందని భావించానని, బెయిలు వచ్చిందని తెలియగానే ఆనందం పట్టలేక గట్టిగా అరిచానని పేర్కొంది. మరోవైపు, తమను తిరిగి కలపాలంటూ సౌదీ అరేబియాలో ఉంటున్న సీమా భర్త గులామ్ హైదర్ భారత ప్రభుత్వాన్ని కోరాడు.