Pawan Kalyan: పొత్తులపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!

  • రేపటి నుంచి వారాహి విజయ యాత్ర రెండో దశ
  • మంగళగిరిలో కీలక సమావేశం
  • పొత్తులకు తొందరేమీ లేదన్న పవన్ కల్యాణ్
  • బలంగా పని చేస్తే అధికారం దానంతట అదే వస్తుందని వెల్లడి
  • వచ్చే ఎన్నికల ద్వారా రాష్ట్రానికి స్థిరత్వం తెస్తామని స్పష్టీకరణ
Pawan Kalyan said no hurry to make alliance

జనసేన వారాహి విజయ యాత్ర రెండో దశ రేపు (జులై 9) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర సాగిన నియోజకవర్గాల ఇన్చార్జులు, పరిశీలకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, అందుకు చాలా సమయం ఉందని అన్నారు. అన్ని అంశాలపై, అన్ని కోణాల్లో, సమగ్రంగా చర్చించాకే పొత్తులపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. పొత్తుల విషయంలో మండల స్థాయి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. బలంగా పని చేస్తే అధికారం దానంతట అదే వస్తుందని జనసేన శ్రేణులకు పవన్ ఉద్బోధించారు. 

ప్రస్తుతం జనసేనకు అనుకూల వాతావరణం కనిపిస్తోందని, జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళుతోందని అన్నారు. తాము ఏ సమస్యపై స్పందించినా అది ప్రజల్లోకి చేరిపోతోందని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి విజయ యాత్రతో ఆ విషయం స్పషమైందని పవన్ కల్యాణ్ అన్నారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే తాము చేసిన తప్పేంటో ప్రజలకు అర్థమైందని తెలిపారు. కొందరు ఒక్కరోజులోనే అర్థం చేసుకోగలిగారని, ఇప్పుడు 70 శాతం ప్రజలకు తెలిసిపోయిందని వివరించారు. 

ఇకనైనా రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే రాష్ట్రం అథోగతి పాలవుతుందని, వచ్చే ఎన్నికల ద్వారా రాష్ట్రానికి స్థిరత్వం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని పవన్ చెప్పారు.

More Telugu News