Australia: స్టోక్స్ సెంచరీ వృథా... రెండో టెస్టులో ఇంగ్లండ్ నుంచి విజయాన్ని లాగేసుకున్న ఆసీస్

  • లార్డ్స్ మైదానంలో యాషెస్ టెస్టు
  • 43 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లండ్
  • 371 పరుగుల లక్ష్యఛేదనలో 327 ఆలౌట్
  • 155 పరుగులు చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్
  • 5 టెస్టుల సిరీస్ లో ఆసీస్ 2-0తో ముందంజ
Australia pulls off win from host England in 2nd test

యాషెస్ సిరీస్ రెండో టెస్టు అద్భుత రీతిలో ముగిసింది. విజయం కోసం తుదకంటా పోరాడిన ఆతిథ్య ఇంగ్లండ్ 43 పరుగుల తేడాతో ఓడింది. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ (155) వీరోచిత సెంచరీ వృథా అయింది. 371 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆటకు ఐదో రోజున 327 పరుగులకు ఆలౌట్ అయింది. 

ఓ దశలో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతున్నట్టే అనిపించింది. భారీ షాట్లు ఆడిన స్టోక్స్ గెలుపుపై ఆశలు పెంచాడు. స్టోక్స్ కు బెయిర్ స్టో, బ్రాడ్ కొద్దిసేపు అండగా నిలిచారు. అయితే ఆసీస్ బౌలర్ హేజిల్ వుడ్ ఓ చక్కని బంతితో స్టోక్స్ ఇన్నింగ్స్ కు తెరదించాడు. స్టోక్స్ 214 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సులతో 155 పరుగులు చేశాడు. 

స్టోక్స్ అవుటైన అనంతరం టపటపా వికెట్లు పడడంతో ఇంగ్లండ్ ఓటమి దిశగా సాగింది. చివర్లో జోష్ టంగ్ (19) కాసేపు పోరాడినా, స్టార్క్ బౌలింగ్ లో బౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కు తెరపడింది. అంతకుముందు, ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ 83 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3, కెప్టెన్ పాట్ కమిన్స్ 3, హేజిల్ వుడ్ 3 వికెట్లు పడగొట్టారు. కామెరాన్ గ్రీన్ కు ఒక వికెట్ దక్కింది. 

మొదటి టెస్టులానే ఈ టెస్టులో కూడా టాస్ గెలిచిన ఇంగ్లండ్... ఆసీస్ కు మొదట బ్యాటింగ్ అప్పగించింది. తొలి టెస్టులో ఓడినా, మళ్లీ అదే నిర్ణయం తీసుకోవడం పట్ల ఇంగ్లండ్ వ్యూహకర్తలపై విమర్శలు వస్తున్నాయి. 

ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ తన మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో కంగారూలు 279 పరుగులు చేసి ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే ఇంగ్లండ్ ఛేదనలో విఫలమైంది. 327 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. 

ఈ విజయంలో ఆస్ట్రేలియా జట్టు 5 టెస్టుల యాషెస్ సిరీస్ లో 2-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు జులై 6 నుంచి హెడింగ్లేలో జరగనుంది.

More Telugu News