Sucharita Mohanty: ప్రచారానికి డబ్బుల్లేవని టికెట్‌ను వెనక్కి ఇచ్చేసిన కాంగ్రెస్ అభ్యర్థి

  • ఒడిశాలోని పూరి నుంచి బరిలోకి దిగిన సుచరిత మొహంతి 
  • ప్రచారానికి నిధులు ఇచ్చేందుకు పార్టీ నిరాకరించిందంటూ కేసీ వేణుగోపాల్‌కు లేఖ
  • విరాళాలు సేకరించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదని ఆవేదన
  • అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన
Sucharita Mohanty Congress Puri candidate opts out of polls

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది నేతలు పార్టీని వీడగా తాజాగా ఒడిశాలోని పూరి లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉన్న ఆ పార్టీ అభ్యర్థి సుచరిత మొహంతి తన టికెట్‌ను పార్టీకి వెనక్కి ఇచ్చేశారు. ప్రచారానికి అవసరమైన నిధులు తన వద్ద లేవని, పార్టీ కూడా తగినన్ని నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఖర్చులు తగ్గించుకున్నప్పటికీ ప్రచారం ప్రభావవంతంగా సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘పార్టీ నుంచి నాకు ప్రచారం కోసం నిధులు అందలేదు. అసెంబ్లీ స్థానాల్లో బలహీన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. డబ్బుల విషయంలో బీజేపీ, బీజేడీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బుల్లేకుండా బరిలోకి దిగడం కష్టం. అందుకనే పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను’’ అని సుచరిత తెలిపారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) అభ్యర్థి పినాకి మిశ్రా చేతిలో సుచరిత ఓటమి పాలయ్యారు. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు చెబుతూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు సుచరిత లేఖ రాశారు. పార్టీ తనకు ఫండ్స్ ఇవ్వలేదని, రాష్ట్ర అధ్యక్షుడు అజోయ్ కుమార్ మాత్రం తననే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకోమంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. నెలవారీ జీతంతో గడిపే జర్నలిస్టునైన తాను పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చానని గుర్తుచేశారు. ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు, ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించినా ప్రచారంలో నెగ్గుకు రాలేకపోతున్నట్టు సుచరిత తెలిపారు.

  • Loading...

More Telugu News