అవును.. అతను ఒక్కడే ఆడి కప్పు గెలిచాడు..: ధోనీపై హర్బజన్ సింగ్ సెటైర్
- ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఓడిన భారత్
- దీంతో ధోనీ సారథ్యంలోనే కప్పులు వచ్చాయంటూ అభిమానుల ట్వీట్లు
- మిగతా 10 మంది కాకుండా ధోనీ ఒక్కడి వల్లేనంటూ హర్బజన్ వ్యంగ్యం
‘‘కోచ్ లేడు. మార్గదర్శి కూడా లేడు. అంతా కుర్రాళ్లే. సీనియర్ ఆటగాళ్లు బాధ్యత తీసుకునేందుకు ఇష్టపడలేదు. అంతకుముందు వరకు ఒక్క మ్యాచ్ కు కూడా కెప్టెన్ గా వ్యవహరించలేదు. ఈ కుర్రాడు సెమీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియాను ఓడించాడు. కెప్టెన్ అయిన 48 గంటల్లోనే టీ20 వరల్డ్ కప్ గెలిచాడు’’ అంటూ శ్రేయాస్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. దీన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ పై హర్బజన్ సింగ్ ట్యాగ్ చేస్తూ, తనదైన శైలిలో స్పందించాడు.
‘‘నిజమే ఈ మ్యాచులు ఆడినప్పుడు ఈ ఒక్క కుర్రాడే భారత్ నుంచి ఆడాడు. ఇతర 10 మంది ఆటగాళ్లు ఆడనేలేదు. అతడు ఒక్కడే ప్రపంచకప్ ట్రోఫీలను గెలిచాడు. వ్యంగ్యం ఏంటంటే.. ఆస్ట్రేలియా అయినా, మరే దేశమైనా ప్రపంచకప్ గెలిస్తే ఆ దేశం గెలిచిందని చెబుతారు. కానీ, భారత్ గెలిస్తే మాత్రం కెప్టెన్ గెలిచినట్టు చెబుతారు. ఇవి జట్టుగా ఆడేవి. గెలిచినా సమష్టిగానే, ఓడినా సమష్టిగానే’’ అంటూ హర్బజన్ సింగ్ తన ట్వీట్ ద్వారా స్పందించాడు. తాము సైతం కష్టపడి ఆడడం వల్లే టీమిండియాకు అన్ని విజయాలు వచ్చాయని చెప్పేందుకు, తమను విస్మరించే అభిమానులకు దాన్ని గుర్తు చేసేందుకు హర్బజన్ ఇలా స్పందించినట్టు అర్థం చేసుకోవాలి.