కేసీఆర్ లాంటి వ్యక్తి పందిరేస్తే కుక్కతోక తాకి కూలిపోయిందట.. అందుకే కాళేశ్వరం మూడు నెలలకే మునిగిపోయింది: షర్మిల సెటైర్లు
- కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ నాయకులు తప్ప ఎవ్వరూ బాగుపడలేదన్న షర్మిల
- కేసీఆర్ తన పేరును కమీషన్ల చంద్రశేఖర్ రావుగా మార్చుకోవాలని వ్యాఖ్య
- ప్రభుత్వం మారితేనే రైతులు బాగుపడతారని, ఉద్యోగాలొస్తాయన్న షర్మిల
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ నాయకులు తప్ప ఏ ఒక్క వర్గం బాగుపడలేదని విమర్శించారు. ‘‘కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని కేసీఆర్ రూ.లక్ష కోట్లకు పెంచారు. కేసీఆర్.. కమీషన్ల చంద్రశేఖర్ రావుగా పేరు మార్చుకోవాలి’’ అని దుయ్యబట్టారు.
‘‘కమీషన్ల కోసమే ప్రాజెక్టులను రీ డిజైన్ చేశారు. కమీషన్ల కోసమే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డికి కట్టబెడుతున్నారు. కమీషన్లు ఇస్తారు కాబట్టే పాలమూరు, మిషన్ భగీరథ సహా అన్ని కాంట్రాక్టులను మేఘాకు ఇస్తున్నారు’’ అని ఆరోపించారు. ప్రాజెక్టులకైతే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కేసీఆర్ కు కమీషన్ వస్తుందని, పథకాల అమలుకైతే కమీషన్ రాదని అన్నారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం రైతుకు శాపమని, ప్రభుత్వం మారితేనే రైతులు బాగుపడతారని, ఉద్యోగాలొస్తాయని షర్మిల చెప్పారు. ప్రజలంతా ఏకమై కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.