హైదరాబాదులో బైక్ ను ఢీకొన్న కారు.. టెకీ దుర్మరణం

hyderabadi Techie dies in road accident
  • మెహిదీపట్నం-శంషాబాద్ ఎక్స్‌ప్రెస్ వే మార్గంలో శనివారం రాత్రి ప్రమాదం
  • గూగుల్ మ్యాప్స్ చూస్తూ తప్పుడు మార్గంలో టెకీ ప్రయాణం
  • తప్పు గుర్తించి వెనక్కు మళ్లిన సమయంలో టెకీకి యాక్సిడెంట్
  • చికిత్స పొందుతూ మరుసటి రోజు కన్నుమూసిన టెకీ
  • మ‌ృతుడిని కృష్ణాజిల్లాకు చెందిన ఎంహెచ్ఎస్‌వీఎస్‌ చరణ్‌గా గుర్తింపు
హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టెకీ దుర్మరణం చెందాడు. గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూ వెళ్లిన అతడు తప్పుడు మార్గంలో వెళుతున్నట్టు గుర్తించి వెనక్కు మళ్లిన సమయంలో మెహిదీపట్నం-శంషాబాద్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో పిల్లర్ నంబర్ 84 వద్ద శనివారం అర్ధరాత్రి ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో టెకీ ఎంహెచ్ఎన్‌వీఎస్ చరణ్(22) మరణించాడు. వాహనం వెనక కూర్చున్న ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

కృష్ణాజిల్లా చిన్నగొల్లపాలెం గ్రామానికి చెందిన చరణ్ నగరంలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వీకెండ్ కావడంతో అతడు తన స్నేహితులతో కలిసి శనివారం సాయంత్రం బైకులపై షికారుకు బయలుదేరారు. తొలుత నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం చూశాక వారు ట్యాంక్‌బండ్‌పై సేద తీరారు. ఆ తరువాత గూగుల్‌ మ్యాప్స్ సాయంతో మెహిదీపట్నం నుంచి కేబుల్ బ్రిడ్జి వైపు బయలుదేరారు. వారిలో కొందరు రెండు బైకులపై ముందు వెళ్లిపోయారు. చరణ్ గూగుల్ మ్యాప్స్ చూస్తూ బైక్‌ను ఎక్స్‌ప్రెస్ వే వైపు మళ్లించాడు. 

ఆ తరువాత దారి తప్పినట్టు గుర్తించి, గచ్చిబౌలి వెళ్లేందుకు పిల్లర్ నంబర్ 82 వద్ద ఎక్స్‌ప్రెస్ వే నుంచి ర్యాంపు ద్వారా కిందకు దిగేందుకు మలుపు తిరిగాడు. ఈ క్రమంలోనే ఆరాంఘర్ వైపు నుంచి వస్తున్న కారు ఈ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో చరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న లంగర్ హౌస్ ఇన్‌స్పెక్టర్, ఎస్ఐలు గాయపడిన చరణ్‌ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. 
Go Back to Shorts
Hyderabad
Krishna District

More Telugu News