కూతురుతో కలిసి నీట్ పరీక్ష రాసిన తండ్రి.. ఎక్కడంటే!
- ఖమ్మంలో కోచింగ్ సెంటర్ నడుపుతున్న 49 ఏళ్ల సతీష్ బాబు
- నీట్ పరీక్షకు వయో పరిమితి ఎత్తి చేసిన నేషనల్ మెడికల్ కమిషన్
- కూతురుతో కలిసి పరీక్షకు హాజరైన సతీష్
సతీష్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ కోర్సు చేశారు. నీట్ పరీక్ష రాయడానికి జీవశాస్త్రం అవసరం కాబట్టి ఇంటర్ లో జువాలజీ, బోటనీ సబ్జెక్టులకు హాజరు కావడానికి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి ప్రత్యేక అనుమతి కూడా పొందారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం జువాలజీ, బోటనీ పరీక్షలు రాశారు. వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరీక్షల్లో పాస్ అవడంతో పాటు నీట్‌ను కూడా క్రాక్ చేస్తానని ఆశిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాను ఎలాగైనా ఎంబీబీఎస్ పూర్తి చేసి హాస్పిటల్ పెట్టి పేదలకు వైద్యం అందించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రయత్నంలో తాను నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోయినా యువతకు స్ఫూర్తిగా నిలవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఈ ఏడాది నీట్ లో పాస్ అవ్వకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని మళ్లీ రాస్తానని తెలిపారు. తన తండ్రితో కలిసి నీట్‌కు హాజరుకావడం చాలా సంతోషంగా ఉందని సతీష్ కూతురు జోషిక స్వప్నిక అంటోంది. కాగా, సతీష్ పెద్ద కూతురు సాత్విక ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో బీడీఎస్ చదువుతోంది.