శ్రీలంకను దాటి... 50 ఏళ్ల గరిష్ఠానికి పాకిస్థాన్ ద్రవ్యోల్బణం, ధరలు మరింత పెరిగే ఛాన్స్
- ఏడాది ప్రాతిపదికన ఏప్రిల్ లో 36.4 శాతం పెరిగిన ద్రవ్యోల్బణం
- ఈ ఏడాది 20 శాతం పడిపోయిన పాకిస్థాన్ రూపాయి వ్యాల్యూ
- రికార్డ్ స్థాయికి ఆహార, ఇంధన ధరలు
- ద్రవ్యోల్బణంలో శ్రీలంకను దాటి ఆసియాలో మొదటి స్థానానికి పాక్
పాక్ కరెన్సీ పతనం ఇక్కడి ధరల పెరుగుదలకు మరింత ఊతమిస్తోంది. పాక్ రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి చేరుకొని ఆహారం, ఇంధన ధరలు రికార్డ్ స్థాయికి చేరుకోవడంతో శ్రీలంకను అధిగమించడంతో పాటు ద్రవ్యోల్బణంలో ఆసియాలో పాకిస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది. 2023లో పాక్ రూపాయి డాలర్ మారకంతో 20 శాతం క్షీణించడంతో దిగుమతి ఖరీదుగా మారింది.
గత ఏడాది ఏప్రిల్ తో పోలిస్తే ఈ ఏప్రిల్ నెలలో ఆహార ద్రవ్యోల్బణం 48.1 శాతానికి చేరుకుంది. రవాణా ధరలు 56.8 శాతం పెరిగాయి. దుస్తులు, పాదరక్షల ధరలు 21.6 శాతం, గృహ, నీరు, విద్యుత్ ధరలు 16.9 శాతం పెరిగాయి. పాక్ గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం 40.2 శాతంగా నమోదయింది.
ఐఎంఎఫ్ నుండి 6.5 బిలియన్ డాలర్ల రుణ కార్యక్రమ పునరుద్ధరణ కోసం పాకిస్థాన్ ఇక్కట్లు పడుతోంది. ఆ సంస్థ మెప్పు కోసం దేశీయంగా పూర్తిస్థాయిలో పన్నులు పెంచాల్సి ఉంది. అదే జరిగితే ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదముంది. ఇప్పటికే ధరల ఒత్తిడిని తగ్గించుకోవడానికి పాక్ గత నెల వడ్డీ రేట్లను 21 శాతానికి చేర్చింది. 1956 తర్వాత ఈ స్థాయిలో వడ్డీ రేట్లు ఉండటం ఇదే మొదటిసారి.