Adireddy Bhavani: టీడీపీ మహానాడును అడ్డుకునేందుకే మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు: ఆదిరెడ్డి భవానీ

  • చిట్ ఫండ్ కేసులో ఆదిరెడ్డి వాసు, అప్పారావు అరెస్ట్
  • తన భర్త, మామలను ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడంలేదన్న భవాని
  • ఎలాంటి సమాచారం లేకుండానే అరెస్ట్ చేశారని ఆగ్రహం
  • న్యాయస్థానాల్లో ఇలాంటి కేసులు నిలబడవని వ్యాఖ్యలు
Adireddy Bhavani talks to media on latest developments

రాజమండ్రిలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసులను చిట్ ఫండ్ కేసులో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీనిపై, టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ స్పందించారు. తన భర్త, మామలను ఎందుకు అరెస్ట్ చేశారో స్పష్టమైన కారణాలు తెలియవని అన్నారు. ఎలాంటి సమాచారం లేకుండానే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. 

అయితే, రాజమండ్రిలో టీడీపీ మహానాడును అడ్డుకునేందుకే తమ కుటుంబాన్ని టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. తమపై కక్షతోనే అక్రమ అరెస్ట్ లకు పాల్పడ్డారని ఆదిరెడ్డి భవాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చిట్ ఫండ్ సంస్థలో రెండ్రోజుల పాటు తనిఖీలు చేశారని, తమపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారని వివరించారు. కానీ తాము పార్టీ కోసం నిలబడాలని నిర్ణయించుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశామని తెలిపారు. 

ఏదో ఒక అంశం పట్టుకుని ఇలాంటి కేసులు పెడుతుంటారని, కానీ న్యాయస్థానాలకు వెళితే ఈ కేసులు నిలబడవని ఆదిరెడ్డి భవానీ వ్యాఖ్యానించారు. టీడీపీ వాళ్లను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని, వారి మనోధైర్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి టార్చర్ లకు గురిచేయడాన్ని రాజకీయాల్లో ఎవరూ చూసి ఉండరని అన్నారు. టీడీపీ హయాంలో ఇలా చేసుంటే వైసీపీ నేతలు ఏమై ఉండేవాళ్లు? అని ప్రశ్నించారు. 

ప్రశ్నించే గొంతుకలు నొక్కుతున్నారని, రాజమండ్రిలో ఆదిరెడ్డి కుటుంబానికి ఎలాంటి పేరు ఉందో అందరికీ తెలుసని అన్నారు. ఏ సమయంలో వచ్చినా పేదలకు అండగా నిలబడే కుటుంబం తమది అని ఆమె స్పష్టం చేశారు. ఏదైనా తప్పు చేస్తే న్యాయస్థానాలు ఉన్నాయని, కానీ కక్ష సాధింపు చర్యలు సరికాదని హితవు పలికారు. 

తాము 35 ఏళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నామని, రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ తమ వాళ్లు ఈ వ్యాపారం చేశారని, ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని వెల్లడించారు. కానీ వీళ్లు ఏ కారణంతో అరెస్ట్ చేశారో అర్థం కావడంలేదని, కక్ష సాధింపు చర్యలే అయితే తాము ఊరుకోబోమని స్పష్టం చేశారు.

More Telugu News