YSR: వైఎస్సార్ ఇప్పుడు నిజంగా చనిపోయారు: సీపీఐ రామకృష్ణ

  • వైఎస్సార్ పరువును ఆయన కుటుంబ సభ్యులు బజారున పడేశారన్న రామకృష్ణ
  • అందరూ ఒకే రోజు టీవీల్లో కనిపించారని వ్యాఖ్య
  • జగన్‌కు మనశ్శాంతి తప్ప అన్నీ ఉన్నాయన్న రామకృష్ణ 
  • అమిత్ షా రిజర్వేషన్ల ఎత్తివేత వ్యాఖ్యలపై ఫైర్
YSR Really Dead Now on seeing family members Says CPI Ramakrishna

తమ కుటుంబ పరువును బజారులో పడేసిన కుటుంబ సభ్యులను చూసి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇప్పుడు నిజంగా చనిపోయారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో ఇరుక్కున్న అవినాశ్ రెడ్డి గురించి ఆలోచిస్తూ జగన్, తెలంగాణలో పోలీసులను కొట్టిన షర్మిల, ఆమెను చూసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విజయమ్మ ఇలా అందరూ ఒకే రోజు టీవీల్లో కనిపించారని, వారి వల్ల వైఎస్సార్ పరువు పోయిందని అన్నారు. ఇవన్నీ చూసి వైఎస్సార్ నిజంగా ఇప్పుడు చనిపోయి ఉంటారని అన్నారు.

దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రి జగన్‌కు మనశ్శాంతి తప్ప అన్నీ ఉన్నాయని అన్నారు. వివేకా హత్య కేసును నాలుగేళ్లుగా సీబీఐ విచారిస్తోందని, చూస్తుంటే మరో ఏడాదిపాటు కొనసాగేలా ఉందని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై రామకృష్ణ మాట్లాడుతూ.. ముస్లింలు, దళితులు, ఇతర వర్గాల మధ్య విభేదాలు సృష్టించేందుకే ఆయన ఆ ప్రకటన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం, ధర్మవరం బహిరంగ సభల్లో మాట్లాడుతూ రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News