CSK: ఎక్కడైనా సూపర్ కింగ్స్!

  • కోల్ కతాను దాని సొంతగడ్డపై ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్
  • 49 పరుగుల తేడాతో విజయం సాధించిన ధోనీ సేన
  • 236 పరుగుల లక్ష్యఛేదనలో 186 పరుగులే చేసిన కోల్ కతా
  • రింకూ సింగ్ పోరాటం వృథా
  • రాణించిన జాసన్ రాయ్
CSK beat KKR by 49 runs

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ ను దాని సొంతగడ్డపైనే ఓడించింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 49 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. హార్డ్ హిట్టర్ రింకూ సింగ్ 53 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. 

అంతకుముందు, జాసన్ రాయ్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 61 పరుగులు చేసి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. రాయ్ మరికాసేపు క్రీజులో ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేది. తీక్షణ బౌలింగ్ లో వరుసగా రెండు ఫోర్లు బాదిన రాయ్ ఆ తర్వాత బంతికి బౌల్డ్ అయ్యాడు.  కోల్ కతా ఇన్నింగ్స్ లో ఓపెనర్లు ఎన్ జగదీశన్ (1), సునీల్ నరైన్ (0) దారుణంగా విఫలమయ్యారు. 

ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్ 20, కెప్టెన్ నితీశ్ రాణా 27 పరుగులతో ఫర్వాలేదనిపించారు. పవర్ హిట్టింగ్ చేస్తాడుకున్న ఆండ్రీ రస్సెల్ ఒక సిక్స్ బాది అంతటితో సరిపెట్టుకున్నాడు. రస్సెల్ 9 పరుగులు చేసి పతిరణ బౌలింగ్ లో అవుటయ్యాడు. 

చివరి 5 ఓవర్లలో కోల్ కతా జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోగా, సాధించాల్సిన రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. సిక్సర్ల వీరుడు రింకూ సింగ్ క్రీజులో ఉన్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రింకూ సింగ్ ఓ సిక్స్ కొట్టి అర్ధసెంచరీ పూర్తి చేసుకోవడం ఒక్కటే కాస్త చెప్పుకోదగ్గ విషయం. 

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 2, మహీశ్ తీక్షణ 2, ఆకాశ్ సింగ్ 1, మొయిన్ అలీ 1, జడేజా 1, పతిరణ 1 వికెట్ తీశారు. 

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. అజింక్యా రహానే 71 (నాటౌట్), డెవాన్ కాన్వే 56, శివమ్ దూబే 50, రుతురాజ్ గైక్వాడ్ 35 పరుగులు చేశారు.

More Telugu News