2014 లో మోదీని గెలిపించింది ఆయన ఛరిష్మానే.. డిగ్రీలు కాదు: అజిత్ పవార్
- ప్రధాని సర్టిఫికెట్ల వివాదంపై స్పందించిన ఎన్సీపీ లీడర్
- మోదీ డిగ్రీలపై స్పష్టత వస్తే ద్రవ్యోల్బణం తగ్గిపోతుందా.. ఉద్యోగాలు వస్తాయా అంటూ ప్రశ్న
- ఎన్నుకున్నందుకు ఏంచేశారన్నదే చూడాలని ప్రజలకు సూచన
ప్రధాని మోదీ డిగ్రీల గురించి తెలుసుకుంటే దేశంలో ద్రవ్యోల్బణం తగ్గిపోతుందా..? లేక నిరుద్యోగ సమస్య సమసిపోతుందా అని అజిత్ పవార్ ప్రశ్నించారు. ఎన్నికలలో ఓటేసి గెలిపించిన నేత తన ఐదేళ్ల పాలనలో ఏం చేశాడనేదే ముఖ్యమని, ప్రజలు గమనించాల్సింది అదేనని సూచించారు. కాగా, ప్రధాని మోదీ డిగ్రీలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆర్టీఐ చట్టం ద్వారా దరఖాస్తు చేయడంతో సీఐసీ స్పందించి గుజరాత్ యూనివర్సిటీకి ఆదేశాలిచ్చారు. దీనిపై గుజరాత్ వర్సిటీ కోర్టుకెక్కింది. ఈ కేసును విచారించిన గుజరాత్ హైకోర్టు.. మోదీ విద్యార్హతల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని తీర్పిచ్చింది. దీనిపై వివాదం రేగడంతో తాజాగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ స్పందించారు.