గర్భనిరోధానికి ఇక పిల్స్‌తో పనిలేదు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త విధానం అమలుకు కేంద్రం రెడీ!
- మూడు నాలుగు సెంటీమీటర్ల పొడవుతో సూదిలా సాధనం
- మోచేతి చర్మం కింద పైపొరలో అమరిక
- గర్భాన్ని నిరోధించే హార్మోన్ విడుదల
- అన్ని రాష్ట్రాల్లోనూ ఉచితంగా పంపిణీ చేయనున్న కేంద్రం
- బిడ్డల మధ్య ఎడం కోరుకునే వారికి ఉపయుక్తం
- సంతానం కావాలనుకున్నప్పుడు ఈజీగా తొలగించొచ్చు
ఈ సాధనాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తారు. స్టాఫ్ నర్సులు కూడా దీనిని సులభంగా అమర్చేలా శిక్షణ ఇస్తారు. ఈ సాధనం వల్ల ఎలాంటి అసౌకర్యమూ ఉండదు. అంతేకాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు సులభంగా దీనిని తొలగించుకోవచ్చు. తొలగించిన 48 గంటల తర్వాత గర్భం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కుడిచేతి వాటం ఉన్న వారికి ఎడమవైపు, ఎడమచేతి వాటం ఉన్న వారికి కుడివైపున దీనిని అమరుస్తారు. కెన్యాలో ఈ విధానం దాదాపు రెండున్నర దశాబ్దాలుగా అమల్లో ఉంది.