Nimmala Rama Naidu: జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు శాశ్వతంగా సస్పెండ్ చేస్తారు: నిమ్మల రామానాయుడు

  • ఇళ్లు లేని పేదలను జగన్ వంచిస్తున్నారన్న నిమ్మల
  • ఈ ఏడాది చివరికైనా పేదలకు ఇళ్లను అప్పగించాలని డిమాండ్
  • జగన్ ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని వ్యాఖ్య
People will suspend Jagans govt says Nimmala Rama Naidu

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 85 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి పేదలకు ఇవ్వలేని జగన్... 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇళ్లు లేక పేదలు బాధ పడుతుంటే... కల్లబొల్లి మాటలు చెప్పి వారిని జగన్ వంచిస్తున్నాడని అన్నారు. సెంటు పట్టాల పంపిణీ, జగనన్న ఊళ్లు, ఇళ్ల నిర్మాణం అంతా బోగస్ అని చెప్పారు. 85 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్లను పూర్తిచేసి ఈ ఏడాది చివరి నాటికైనా పేదలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. 

అసెంబ్లీ సమావేశాల్లో తమకు సమాధానాలు చెప్పలేక మంత్రులు ఇబ్బంది పడుతున్నందుకే స్పీకర్ తమను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నారని విమర్శించారు. ప్రజల గొంతులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు శాశ్వతంగా సస్పెండ్ చేస్తారని అన్నారు. జగన్ ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని... ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News