Pee gate: భారత విద్యార్థిపై అమెరికా ఎయిర్‌లైన్స్ నిషేధం

  • విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన ఆర్యా వోహ్రా
  • ఘటనపై సీరియస్ అయిన అమెరికా ఎయిర్‌లైన్స్
  • భారత పోలీసులకు ఫిర్యాదు
  • భవిష్యత్తులో తమ సర్వీసులు వినియోగించకుండా విద్యార్థిపై నిషేధం
Indian Student Banned By American Airlines For Peeing On CoPassenger

అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన భారత విద్యార్థి ఆర్యా వోహ్రాపై(21) ఆ ఎయిర్‌లైన్స్ నిషేధం విధించింది. అతడు భవిష్యత్తులో తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించినట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో ఆర్యా వోహ్రా మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు. అయితే.. ఈ ఘటనపై బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేయలేదు. విద్యార్థి భవిష్యత్తు దృష్ట్యా కంప్లైంట్ ఇచ్చేందుకు వెనకడుగు వేశారు. కానీ.. విమాన సిబ్బంది మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. దీంతో.. శనివారం విమానం ఎయిర్‌పోర్టులో దిగగానే సీఐఎస్ఎఫ్ సిబ్బంది విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. 

తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టినందుకు ఆర్యా వోహ్రాపై నిషేధం విధించినట్టు అమెరికన్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. మద్యం మత్తులో కూరుకుపోయిన అతడు సిబ్బంది సూచనలను పాటించలేదని తెలిపింది. విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగాడని, తోటి ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేశాడని వెల్లడించింది. 

కాగా.. ఆర్యా వోహ్రాపై చర్చలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిందితుడు ఢిల్లీలోని ఢిఫెన్స్ కాలనీ నివాసి అని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ ఉదంతంపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ భారత పౌర విమానయాన శాఖ అమెరికన్ ఎయిర్‌లైన్స్‌ను కోరింది.

More Telugu News