BJP: కేంద్ర దర్యాప్తు సంస్థలపై ప్రధాని మోదీకి 9 మంది ప్రతిపక్ష నేతల బహిరంగ లేఖ

9 Opposition leaders write to PM Modi over misuse of central agencies
  • సీబీఐ, ఈడీని ఉపయోగించి ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపణ
  • గవర్నర్లతో బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన  
  • సంతకం చేసిన కేసీఆర్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ తదితరులు 
సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేసి తమ నాయకులను కేసుల్లో ఇరికించారని ఆరోపిస్తూ, తొమ్మిది మంది ప్రతిపక్ష నాయకులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు, బీజేపీలో చేరిన అవినీతి రాజకీయ నాయకులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా 9 మంది ప్రతిపక్ష నేతలు ఈ లేఖపై సంతకం చేశారు. ప్రతిపక్ష నేతలపై కేంద్ర సంస్థల దుర్వినియోగం, రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్‌ల జోక్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ తో పాటు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్‌సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కేంద్ర సంస్థల దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. 

బీజేపీ హయాంలో  2014 నుంచి కేసు నమోదు చేసిన, అరెస్టు చేసిన, దాడి చేసిన, దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొంటున్న చాలా మంది రాజకీయ నాయకులు ప్రతిపక్షాలకు చెందినవారని వారు చెప్పారు. అదే సమయంలో బీజేపీలో చేరిన ఇతర పార్టీల నాయకుల కేసులపై మాత్రం దర్యాప్తు సంస్థలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని పేర్కొన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ , టీఎంసీ మాజీ నేత సువేందు అధికారి, ముకుల్ రాయ్, మహారాష్ట్రకు చెందిన శ్రీ నారాయణ్ రాణే తదితరుల పేర్లు ప్రస్తావించారు. 

ఇక, గవర్నర్ల కార్యాలయాలు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర పాలనకు విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తెలంగాణ గవర్నర్లు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దర్యాప్తు సంస్థల నిష్పక్షపాతంపై ప్రశ్నలు లేవనెత్తారు. బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ చైర్‌పర్సన్ తేజస్వీ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రతిపక్ష నేతలపై కేంద్ర ప్రభుత్వ దాడులను వ్యతిరేకించారు.
BJP
Narendra Modi
opposition
leaders
KCR
Arvind Kejriwal
letter
CBI
ED

More Telugu News