నాగపూర్ టెస్టులో ముగిసిన రెండో రోజు ఆట... భారత్ కు కీలక ఆధిక్యం
- ఆసక్తికరంగా తొలి టెస్టు
- రెండో రోజు ఆట చివరికి 7 వికెట్లకు 321 రన్స్ చేసిన భారత్
- అర్ధసెంచరీలతో క్రీజులో ఉన్న జడేజా, అక్షర్ పటేల్
- ప్రస్తుతానికి భారత్ ఆధిక్యం 144 పరుగులు
గాయం నుంచి కోలుకుని దాదాపు 6 నెలల తర్వాత బరిలో దిగిన జడేజా బౌలింగ్ లో 5 వికెట్లు తీయడమే కాదు, బ్యాటింగ్ లోనూ అర్ధసెంచరీతో మెరిశాడు. 240 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్ ను జడేజా, అక్షర్ పటేల్ జోడీ ఆదుకుంది. ఇద్దరూ అర్ధసెంచరీలతో రాణించి జట్టుకు విలువైన పరుగులు జోడించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో టాడ్ మర్ఫీ 5, కెప్టెన్ పాట్ కమిన్స్ 1, నాథన్ లైయన్ 1 వికెట్ తీశారు.
అంతకుముందు, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన కంగారూలు పిచ్ పరిస్థితిని అంచనా వేయలేక బ్యాటింగ్ ఎంచుకుని బోర్లా పడ్డారు. టీమిండియా స్పిన్నర్లు అద్భుతంగా రాణించి ఆసీస్ పనిబట్టారు.