హైదరాబాదీలకు మరో పది రోజులపాటు ట్రాఫిక్ కష్టాలు
- కార్ రేసింగ్ తో పాటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆంక్షలు
- వాహనాలతో కిక్కిరిసిపోతున్న రహదారులు
- ఉల్లంఘనల వల్లే ట్రాఫిక్ కష్టాలంటున్న పోలీసులు
మంగళ, బుధవారాలు ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చింది. ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు ప్రధాన రహదారులు, వీధులూ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్, ఫిబ్రవరి 17న కొత్త సచివాలయం ప్రారంభం, ఫిబ్రవరి 18న శివరాత్రి వేడుకలు ఇలా వరుస కార్యక్రమాల నేపథ్యంలో మరో 10 రోజులు ట్రాఫిక్ కష్టాలు తప్పవని తెలుస్తోంది.
గ్రేటర్ లో దాదాపు 80 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయని, ఇందులో రోజూ 30 నుంచి 40 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కనీసం 30 నుంచి 40 నిమిషాలు పడుతుందని వాహనదారులు చెప్పారు. అయితే, ప్రస్తుతం ట్రాఫిక్ ఆంక్షల వల్ల కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి గంట పడుతోందని వాపోతున్నారు.
ట్రాఫిక్ కష్టాలపై పోలీసులు స్పందిస్తూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పారు. సిటీలో రోజూ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 17 వేల చలానాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు.