భారత్ సాయంపై తుర్కియే ప్రశంసల వర్షం
- భారత్ తమ ‘దోస్త్’ అన్న తుర్కియే దేశ రాయబారి
- అవసరానికి అండగా నిలిచేవాళ్లే నిజమైన స్నేహితులంటూ వ్యాఖ్య
- తుర్కియేకు వైద్యులు, మెడికల్ సామగ్రిని తరలించిన భారత్
భూకంపం సమాచారం అందగానే భారత్ తుర్కియేకు వైద్య సిబ్బంది, సహాయ సామగ్రిని తరలించింది. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు, మెడికల్ టీమ్స్‌ను టర్కీకి పంపించేందుకు నిర్ణయించినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం అంతకుముందు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో తుర్కియే ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. మొత్తం రెండు వందల మంది సిబ్బంది ఉన్న 2 జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను తుర్కియే సహాయార్థం పంపించేందుకు నిర్ణయించినట్టు పేర్కొంది. ప్రధాన మంత్రి ముఖ్య సలహాదారు పీ.కే.మిశ్రా ఆధ్వర్యంలో సౌత్ బ్లాక్‌లో తుర్కియేకు అందించాల్సిన తక్షణ సాయంపై సమావేశం జరిగింది.
తుర్కియే, సిరియా దేశాల్లో సోమవారం సంభవించిన భారీ భూకంపం.. ఈ శతాబ్దంలోని భారీ భూకంపాల్లో ఒకటిగా రికార్డుల కెక్కింది. శిథిలమైన భవనాలు, ప్రజల ఆర్తనాదాలతో ఆ ప్రాంతాలు మరుభూమిని తలపిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి బలైన వారి సంఖ్య ప్రస్తుతం 4 వేలు దాటింది. ఈ సంఖ్య మరింతగా పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.