మరో 232 యాప్‌లను నిషేధించనున్న కేంద్రం.. చైనా లింకులే కారణం..
- మరోమారు చైనా యాప్‌లపై గురిపెట్టిన కేంద్రం
- మొత్తం 232 యాప్‌లపై నిషేధానికి సిద్ధం
- వీటిలో 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లు..
ప్రభుత్వం ఆరు నెలల క్రితమే 288 చైనా లోన్ యాప్‌లపై సమీక్ష ప్రారంభించింది. వీటిలో 94 యాప్‌లు వివిధ ఈ-స్టోర్లలో అందుబాటులో ఉండగా మిగిలినవి థర్డ్ పార్టీ లింక్స్ ద్వారా అందుబాటులో ఉన్నాయని తేల్చింది. సర్వర్ సైడ్ భద్రతా వ్యవస్థల దుర్వినియోగంతో ఈ యాప్‌లను గూఢచర్య సాధనాలుగా మార్చొచ్చని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యాప్‌ల ద్వారా దేశ ప్రజల సమాచారం విద్రోహశక్తులకు చేరితే.. యావత్ దేశంపై నిఘా పెట్టే అవకాశం ఉందని అన్నారు. వీటిని నిషేధించాలని తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పాటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు గతంలోనే హోం శాఖను కోరినట్టు సమాచారం.
పరిశీలకులు చెబుతున్న దాని ప్రకారం.. ఈ యాప్‌ల సృష్టికర్తలందరూ చైనా దేశస్తులే. భారత్‌లో యాప్ కార్యకలాపాల కోసం వారు ఇక్కడి వారిని డైరెక్టర్లుగా నియమించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని లోన్‌ల వైపు ఆకర్షించాక.. వడ్డీ రేట్లను అమాంతం 3000 శాతం మేరకు ఈ యాప్‌లు పెంచేస్తున్నాయి. ఫలితంగా లోన్‌లు చెల్లించలేకపోయిన వారిపై యాప్‌ల సిబ్బంది వేధింపులకు దిగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఈ యాప్‌ల బారిన పడి ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో చైనా కుతంత్రాలు వెలుగులోకి వచ్చాయి.