రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా.. కేటుగాళ్లు వున్నారు.. జర భద్రం!
- రీచార్జి చేయించని సిమ్ కార్డులను లాక్ చేస్తున్న టెలికాం కంపెనీలు
- స్వల్ప మొత్తం చెల్లించి ఆ నంబర్లను కొనుగోలు చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
- ఆపై ఆ నంబర్లతో మీ బ్యాంకు ఖాతాలోని సొమ్ము కాజేస్తున్న వైనం
మోసం జరిగేది ఇలా..
రీచార్జ్ చేయకుండా వదిలేసిన నెంబర్ ను టెలికాం కంపెనీలు బ్లాక్ చేస్తాయనే విషయం తెలిసిందే. ఇలా బ్లాక్ చేసిన నెంబర్లను ఆయా కంపెనీలు అమ్మకానికి పెడతాయి. నిర్ణీత మొత్తం చెల్లించి ఈ నెంబర్ ను ఎవరైనా తీసుకోవచ్చు. ఇక్కడే సైబర్ నేరస్థులు తెలివిగా వ్యవహరిస్తున్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో ఇలాంటి నెంబర్లను సొంతం చేసుకుంటున్నారు. ఆపై ఆయా నెంబర్లకు చెందిన పాత యజమానుల బ్యాంకు లావాదేవీల వివరాలను కూపీ లాగుతున్నారు.
టెక్నాలజీ సాయంతో బ్యాంకు ఖాతా, ఈ మెయిల్ ఐడీని తెలుసుకుని మొబైల్ నెంబర్ తో యూపీఐ యాప్ లలోకి లాగిన్ అవుతున్నారు. ఆపై ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫర్గాట్ యూజర్ ఐడీపై క్లిక్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆపై పాస్ వర్డ్ కూడా మార్చేసి, ఖాతాలోని సొమ్మును కొట్టేస్తారు. ఇదంతా మీ పాత మొబైల్ నెంబర్ వారి చేతుల్లోకి వెళ్లడం వల్లే సాధ్యమవుతుందని నిపుణులు హెచ్చరించారు.