Hijab: విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధంపై సీఓటర్ సర్వే.. ఫలితాలు ఇవే!

  • మూడ్ ఆఫ్ ది నేషన్ లో భాగంగా 1.41 లక్షల మంది అభిప్రాయాల సేకరణ
  •  57 శాతం మంది నిషేధం సరైనదేనని చెప్పారన్న ఇండియా టుడే-సీఓటర్ 
  • సరికాదని 26 శాతం మంది అభిప్రాయపడ్డారని వెల్లడి
Mood of the Nation Should Hijab be banned in schools 57 percent say yes

కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ‘ఇండియా టుడే-సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‘ లో భాగంగా ఈ విషయంపై సర్వే నిర్వహించింది. 

ఈ సర్వేలో పాల్గొన్న 1.41 లక్షల మంది వ్యక్తులలో ఎక్కువ మంది దేశంలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌ను నిషేధించడాన్ని సమర్థించారని ఇండియా టుడే పోల్ ఫలితాలను వెల్లడించింది. సర్వేలో 57 శాతం మంది పాఠశాలలు, కళాశాలల్లో మతపరమైన దుస్తులను నిషేధించడాన్ని సమర్థించారని తెలిపింది. 26 శాతం మంది మాత్రం విద్యార్థులు హిజాబ్‌ పై నిషేధం సరికాదన్నారని వెల్లడించింది. 

సర్వే కోసం మొత్తం 1,40,917 మందిని పరిగణనలోకి తీసుకున్నారు. సీ ఓటర్ ట్రాకర్ నుంచి అదనంగా 1,05,008 మంది ఇంటర్వ్యూలను కూడా విశ్లేషించినట్టు ఇండియా టుడే తెలిపింది. కాగా, హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇద్దరు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ధర్మాసనం గత అక్టోబర్‌లో విభజన తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పుపై అప్పీళ్లను భారత ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని ఆదేశించింది. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదని, యూనిఫాం ఆదేశాన్ని అమలు చేసే అధికారం కర్ణాటక ప్రభుత్వానికి ఉందని హైకోర్టు మార్చిలో పేర్కొంది.

More Telugu News