Chandrababu: రాజ్యాంగం మంచిదే... అమలు చేసేవాళ్లు మంచివాళ్లు కాకపోతేనే సమస్య: చంద్రబాబు

  • రిపబ్లిక్ డే సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జెండా ఆవిష్కరించిన చంద్రబాబు
  • రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ పాలన కొనసాగుతోందని వ్యాఖ్యలు
  • రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్న టీడీపీ అధినేత
Chandrababu hoists national flag at his residence in Undavalli on 74th Republic Day

అవకాశాలు కల్పిస్తే తెలుగు ప్రజలు మరిన్ని అద్భుతాలు సాధిస్తారని... ఇదే ఆలోచనతో 2029 నాటికి ఏపీని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మార్చేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రణాళికాబద్ధంగా పనిచేశామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం విధ్వంసాలతో సర్వనాశనం చేసిందని అన్నారు. 

నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు జాతీయ జండా ఆవిష్కరించారు. 74వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ విరుద్ధ, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనతో రాష్ట్ర భవిష్యత్ ప్రమాదంలో పడిందని అన్నారు. 

రాజ్యాంగం  పరిరక్షింపబడినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని... రాజ్యాంగ పరిరక్షణ కోసం నాటి స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిగా నేడు రాష్ట్రంలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం మంచిది అయినా దాన్ని అమలు పరిచేవాళ్లు మంచివాళ్లు కాకపోతే ఫలితం ఉండదని... అదే సమయంలో రాజ్యాంగం ఎలా ఉన్నా దాన్ని అమలు పరిచేవారు మంచి వాళ్లు అయితే ఉత్తమ ఫలితాలు వస్తాయి అన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాటను గుర్తుంచుకోవాలని అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోలేకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. 

నేషన్ ఫస్ట్ (దేశమే ముందు) అనే సిద్దాంతంలో పౌరులు, ప్రభుత్వాలు పని చేయాలని అన్నారు. పేదరికం, అసమానతలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు కంకణబద్ధులై పని చేయాల్సి ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అన్నారు. యువశక్తిని సక్రమంగా వినియోగించుకుంటే ప్రపంచంలో అత్యున్నత స్థాయికి భారత్ చేరుకోవడం తథ్యమని అన్నారు. 'విజన్-2047'తో ప్రణాళికా బద్దంగా ప్రయాణం సాగించాలని పిలుపునిచ్చారు. పేదరికం, అసమానతలు లేని సమాజం సాధించడం లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. 

"యువతకు అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు పాలసీలు తీసుకువచ్చి వాటిని అమలు చేస్తే....ప్రపంచాన్ని జయించే శక్తిగా భారత్ మారుతుంది. ఇప్పుడే 'విజన్-2047' సిద్ధం చేసుకుని... ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లడం ద్వారా...దేశం 100 ఏళ్ల స్వాతంత్య్ర  దినోత్సవ ఉత్సవాలు జరుపుకునే 2047 నాటికి భారత్ ప్రపంచంలోని అగ్రదేశాల్లో 1 లేదా 2వ స్థానాలకు చేరుతుంది. 

ఐటీ, నాలెడ్జ్ ఎకానమీ వంటి విభాగాల్లో ఇప్పటికే ప్రపంచంలో ఉన్నతస్థాయికి భారతీయులు చేరుకున్నారు. అమెరికన్ల తలసరి ఆదాయం 65 వేల డాలర్లు కాగా....ఇండియన్స్ తలసరి ఆదాయం 1,19,000 డాలర్లుగా ఉండడం మన దేశ పౌరుల సమర్థతకు నిదర్శనం. గ్లోబల్ గవర్నెన్స్ లో భారతీయులు మరింతగా రాణించే అవకాశాలు ఉన్నాయి. 

మారుతున్న కాలానికి అనుగుణంగా నాడు వచ్చిన ఐటీ విప్లవాన్ని అవకాశంగా మార్చుకోవడం ద్వారా తెలుగువారు ప్రపంచ స్థాయిలో ఉత్తమ విజయాలు సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న పాలసీలు, సంస్కరణల ఫలితాలను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పొందుతోంది" అని చంద్రబాబు వివరించారు.  

More Telugu News