Haldiram: మహిళా ఐపీఎల్ జట్ల కోసం హేమా హేమీల పోటీ

Haldirams Infyosys Shriram in race to own teams in Womens IPL
  • హల్దీరామ్స్, ఇన్ఫోసిస్, శ్రీరామ్ గ్రూపు ఆసక్తి
  • టెండర్ డాక్యుమెంట్ కొనుగోలు
  • పోటీలో పురుషుల 10 ఫ్రాంచైజీలు 
  • ఈ నెల 25న జట్ల వేలం
ఈ ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ ను బీసీసీఐ నిర్వహించనుంది. ఐదు జట్లతో ఐపీఎల్ మొదటి సీజన్ మార్చిలో మొదలు కానుంది. బిడ్డింగ్ ద్వారా జట్లను వేలం వేసే ప్రక్రియను బీసీసీఐ చేపట్టింది. పురుషుల ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు ఉండడం తెలిసిందే. కానీ, మహిళా క్రికెట్ వచ్చే సరికి పరిస్థితులు భిన్నం. చూసే ప్రేక్షకులు తక్కువగా ఉండడం, క్రీడాకారిణుల లభ్యత తక్కువ ఉండడం వంటి అంశాల నేపథ్యంలో తొలుత ఐదు జట్లతోనే ఐపీఎల్ ఆరంభించనున్నారు.

ఐపీఎల్ మహిళా జట్టును సొంతం చేసుకునేందుకు దిగ్గజ పారిశ్రామిక గ్రూపులు ప్రయత్నాలు ప్రారంభించాయి. హల్దీరామ్స్, ఇన్ఫోసిస్, శ్రీరామ్ గ్రూప్ టెండర్ డాక్యుమెంట్ ను కొనుగోలు చేశాయి. ఈ సంస్థలు బిడ్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. అలాగే, పురుషుల ఐపీఎల్ 10 ఫ్రాంచైజీలు కూడా బిడ్ డాక్యుమెంట్ తీసుకున్నాయి. కనుక ఇవి కూడా బిడ్ వేయడం ఖాయమే. మహిళా ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం మహిళల బ్రాండ్లకు సంబంధించిన కంపెనీల నుంచి ఎంతో ఆసక్తి ఉన్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 25న మహిళా ఐపీఎల్ జట్ల వేలం జరగనుంది. అదే రోజు విజేతలను బీసీసీఐ ప్రకటిస్తుంది. 

గతేడాది జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్ కు మొత్తం మీద 10.05 కోట్ల టెలివిజన్ వ్యూవర్ షిప్ నమోదైంది. మొదటి ఐదేళ్ల పాటు మహిళా ఐపీఎల్ మ్యాచ్ ప్రసార హక్కులను రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాలు కలిగిన వయాకామ్ 18 సొంతం చేసుకోవడం తెలిసిందే. ఐదేళ్లకు కలిపి రూ.951 కోట్లు చెల్లించనుంది. అంటే ఏటా రూ.190 కోట్లు, ఒక్కో మ్యాచ్ నకు రూ.7.09 కోట్ల చొప్పున వయాకామ్ 18 చెల్లిస్తుంది. రూ.190 కోట్లలో 80 శాతాన్ని మహిళా ఐపీఎల్ జట్లకు బీసీసీఐ పంచనుంది. ఒక్కో ఫ్రాంచైజీకి రూ.38 కోట్ల చొప్పున మొదటి ఏడాది నుంచే ఆదాయం రానుంది. 

Haldiram
Infyosys
Shriram group
Womens IPL
race

More Telugu News