కొత్త వేరియంట్ వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్
- ఆందోళన అక్కర్లేదు.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
- ఎయిర్ పోర్టులో ప్రయాణికుల స్క్రీనింగ్
- పాజిటివ్ వ్యక్తుల శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిస్తున్నట్లు వెల్లడి
కరోనా కొత్త వేరియంట్ చైనా, అమెరికా, జపాన్, దక్షిణకొరియా దేశాలను భయపెడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. జనం ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో మాస్క్ వాడకాన్ని ప్రోత్సహించడంతో పాటు కరోనా సోకకుండా జనం జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది.
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌లోనే ఉంది. డిసెంబర్ 21న తెలంగాణలో నమోదైన కేసులు కేవలం ఆరు మాత్రమే. ప్రస్తుతం రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 34 మాత్రమేనని ఆరోగ్య శాఖ ప్రకటించింది. బీఎఫ్ 7 వేరియంట్ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులను స్క్రీనింగ్ చేస్తున్నట్లు, పాజిటివ్ గా తేలిన వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిస్తున్నట్లు వివరించారు.