RX 100: మళ్లీ భారత రోడ్లపై పరుగులు తీయనున్న యమహా ఆర్ఎక్స్ 100

  • 1985లో దేశంలో ఎంట్రీ ఇచ్చిన ఆర్ఎక్స్ 100 
  • 1996 తర్వాత ఉత్పత్తి నిలిపివేసిన యమహా
  • రీడిజైన్ చేస్తున్న జపనీస్ దిగ్గజం
  • ఈసారి 300 సీసీ ఇంజిన్ తో వచ్చే అవకాశం
Yamaha RX 100 coming soon

భారత్ లో 80, 90వ దశకాల్లో కుర్రకారును ఓ ఊపు ఊపిన బైకుల్లో యమహా ఆర్ఎక్స్ 100 ఒకటి. ఈ బైకుల ఉత్పత్తిని యమహా 1996 తర్వాత నిలిపివేసినా, ఇప్పటికీ ఒకటీ అరా కనిపిస్తుంటాయి. లైట్ వెయిట్ తో, చూడగానే ఆకట్టుకునే రూపంతో, శక్తిమంతమైన 2 స్ట్రోక్ ఇంజిన్ తో ఇది సృష్టించే ధ్వని మిగతా బైకులతో పోల్చితే దీన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. 

కాగా, ఆర్ఎక్స్ 100 బైకు మళ్లీ భారత రోడ్లపై రయ్యిమంటూ దూసుకెళ్లేందుకు ముస్తాబవుతోంది. అయితే ఈసారి కొత్త రూపుతో రానున్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ ఆర్ఎక్స్ 100 బైకును త్వరలోనే తీసుకువస్తున్నామని యమహా ఇండియా ప్రెసిడెంట్ ఇషిన్ చిహానా వెల్లడించారు. 

ఇప్పటి ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా బైక్ ను రూపొందించాల్సి ఉన్నందున టు స్ట్రోక్ ఇంజిన్ కనిపించకపోవచ్చు. ఆ లోటును భర్తీ చేసేలా 300 సీసీ శక్తితో పెద్ద ఇంజిన్ అమర్చనున్నారు. 

గతంలో ఆర్ఎక్స్ 100 కేవలం 98 సీసీ ఇంజిన్ మాత్రమే కలిగి ఉన్నప్పటికీ 2 స్ట్రోక్ శక్తితో వేగంగా దూసుకెళ్లేది. 103 కిలోల బరువుతో తేలిగ్గా కనిపించే ఈ బండి... వేగంలో ఇప్పటి 150-160 సీసీ బైకులకు ఏమాత్రం తీసిపోని రీతిలో నిలుస్తుంది. 

ఇక కొత్తగా వచ్చే ఆర్ఎక్స్ 100 బైకు రెట్రో లుక్ తో జావా 42, రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350, హోండా సీబీ350 హైనెస్ తదితర బైకులకు పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి.

More Telugu News