వచ్చే ఏడాది నాటికి చైనాలో 10 లక్షలకుపైగా కొవిడ్ మరణాలు!
- ప్రపంచంలోనే అత్యంత కఠిన కొవిడ్ ఆంక్షలు అమలు చేసిన చైనా
- ప్రజాగ్రహం కారణంగా ఆంక్షల ఎత్తివేత
- వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి పతాక స్థాయికి కేసులు చేరుకుంటాయన్న ఐహెచ్ఎంఈ
- ఇప్పటి వరకు 5,235 మంది మృత్యువాత
చైనా నేషనల్ హెల్త్ అథారిటీ చివరిసారి డిసెంబరు 3న కరోనా మరణాలను నివేదించింది. కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు అధికారికంగా కరోనా మరణాలను వెల్లడించలేదు. చైనా అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఆ దేశంలో ఇప్పటి వరకు 5,235 మంది మాత్రమే కరోనా కారణంగా మృతి చెందారు. ప్రపంచంలోనే అత్యంత కఠినంగా కరోనా ఆంక్షలు అమలు చేస్తున్న చైనా.. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరగడంతో ఈ నెలలో ఆంక్షలను ఎత్తివేసింది. అయితే, ఇప్పుడు వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే నెలలో చైనా జరుపుకోనున్న కొత్త సంవత్సరం వేడుకల నాటికి దేశంలోని అందరికీ కరోనా సోకుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.