ఏపీని అతలాకుతలం చేసిన మాండూస్ తుపాను.. నేడు కూడా వర్షాలు!
- తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ తదితర జిల్లాల్లో తుపాను బీభత్సం
- శ్రీకాళహస్తి-తడ మార్గంలో సున్నపు కాల్వపై చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు
- వర్షాల కారణంగా తమిళనాడులో నలుగురి మృతి
- వేలాది ఎకరాల్లోని పంటలు వర్షంపాలు
చేపల వేటకు వెళ్లి చిక్కుకుపోయిన జాలర్ల గుర్తింపు
తిరుమల ఘాట్ రోడ్డులో వృక్షాలు కూలడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిన్న మధ్యాహ్నం వరకు మెట్ల మార్గం వైపు నుంచి భక్తులను అనుమతించలేదు. బాపట్ల జిల్లా చీరాల వాడరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుపోయారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం తీరానికి రెండు కిలోమీటర్ల తీరంలో వారిని గుర్తించిన అధికారులు వారిని సురక్షితంగా తీరానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీరు ఆరు రోజుల క్రితమే వేటకు వెళ్లగా తుపాను ప్రభావంతో సిగ్నళ్లు లేక దారి తెలియక చిక్కుకుపోయారు. సిగ్నళ్లు అందిన తర్వాత మెరైన్ పోలీసులకు సమాచారం అందించడంతో వారి జాడ తెలిసింది.
ధ్వంసమైన పంటలు
పలు జిల్లాల్లోని వరి, అరటి, పత్తి, వేరుశనగ, మినుము, బొప్పాయి, మిరప సహా వేలాది ఎకరాల్లోని పంటలు ధ్వంసమయ్యాయి. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం దర్జిపల్లిలో ఓ ఇంటిగోడ కూలి ఓ మహిళ మృతి చెందింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో వర్షం బీభత్సం సృష్టించింది. ఇక్కడ శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం నాటికి ఏకంగా 281 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కోస్తాలోనూ ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మాండూస్ తుపాను నిన్న సాయంత్రానికి అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో నేడు కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
చెన్నైలో కూలిన 350 వృక్షాలు
తమిళనాడును తుపాను అతలాకుతలం చేసింది. పలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. శనివారం తెల్లవారుజామున 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. చెన్నైలో 350కిపైగా చెట్లు నేలకూలాయి. 30 వేల మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 10 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మడిప్పాక్కంలో వర్షాలకు గుడిసె కూలి లక్ష్మి (45), ఆమె అన్న కుమారుడు (25) ప్రాణాలు కోల్పోయారు. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరు సమీపంలోని పిళ్లైపాక్కంలో విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు యువకులు మరణించారు.