ఏపీలోని 4 జిల్లాల్లో మూడు రోజులపాటు భారీ వర్షాలు
- బంగాళా ఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల్లో తుపాన్ గా మారే చాన్స్
- ఈ నెల 7, 8, 9 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు
- నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలకు వర్ష సూచన
గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ నుంచి హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి ఈ నెల 7 నాటికి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడనం ఈ నెల 6వ తేదీకి వాయుగుండంగా, ఏడో తేదీకి తుపాన్‌గా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. ఈ నెల 9వ తేదీ రాత్రి లేదా 10వ తేదీ ఉదయం ఉత్తర తమిళనాడులో తీరం దాటుతుందని అంచనా వేశారు. తుపాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాలో 7వ తేదీ రాత్రి నుంచి వర్షాలు కురుస్తాయని చెప్పారు.
ఈ నెల 8, 9 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు, ఉత్తరకోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని దక్షిణ కోస్తాలోని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.