Amazon: 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపే యోచనలో అమెజాన్

Amazon Plans To Lay Off 10000 Employees As Losses Mount
  • ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నమే!
  • లాభదాయకత లేని విభాగాల ఉద్యోగులకు హెచ్చరిక
  • కంపెనీలోనే ఇతర విభాగాలకు మారాలని సూచన
  • కొంతకాలంగా నియామకాలను ఆపేసిన దిగ్గజ కంపెనీ
ట్విట్టర్, మెటా తరహాలోనే ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించాలని అమెజాన్ యోచిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. ఇటీవలి కాలంలో అమెజాన్ కంపెనీ లాభాలు తగ్గుముఖం పట్టాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. పండుగల సీజన్ లో రికార్డు స్థాయిలో వ్యాపారం జరిగేదని, ఈసారి మాత్రం అమ్మకాలలో పెద్దగా పురోగతి కనిపించలేదని పేర్కొన్నాయి. దీంతో కంపెనీ యాజమాన్యంలో ఆలోచనలో పడిందని తెలిపాయి. కంపెనీలోని విభాగాలలో పెద్దగా లాభదాయకం కాని వాటిని గుర్తించి, అందులోని ఉద్యోగులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కంపెనీలోనే ఇతర విభాగాలలో అవకాశాలు వెతుక్కోవాలని సూచించినట్లు తెలిసింది.

ఉద్యోగుల నియామకాలనూ కొంతకాలంగా ఆపేసింది. వేర్ హౌస్ ల నిర్మాణాన్ని వీలైనంత వరకు వాయిదా వేస్తూ వస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదంతా ఖర్చులు తగ్గించుకోవడానికేనని వివరించాయి. దీంతోపాటు పలు విభాగాలలోని సుమారు 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. సాధారణ పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ఏటా అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటుంది. దాదాపు 16 లక్షల మంది ఏటా అమెజాన్ లో చేరుతుంటారు. కాగా, కంపెనీ లాభాలు క్షీణించడంపై అమెజాన్ స్పందిస్తూ.. కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో పొదుపు చేయడంపై జనం ఎక్కువగా దృష్టి పెట్టారని, దాని ఫలితంగానే ఈసారి ఆశించినంతగా అమ్మకాలు నమోదు కాలేదని తెలిపింది.
Amazon
Lay Off
employees
wallstreet journal

More Telugu News